తన జీవితం పూర్తిగా నటనకే అంకితం చేసి, చనిపోయే వరకూ నటిస్తూనే ఉంటా.. అని అభిమానులకిచ్చిన మాటను నిలబెట్టుకుని సంపూర్ణ జీవితాన్ని గడిపిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. అగ్ర హీరోల్లో ఎవరికీ దక్కని అదృష్టం అక్కినేని నాగేశ్వరరావుకే దక్కిందనడం ఎంత మాత్రమూ అతిశయోక్తి అనిపించదు. కొడుకు, మనవళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఇది నిజంగా అరుదైన అనుభవమే. ఆ అపురూపమైన అనుభవాన్ని 'మనం' సినిమాతో విక్రమ్ కుమార్ అక్కినేని నాగేశ్వరరావుకు దక్కించారు.
తాను తనువు చాలించే లోపు చిన్న మనవడు అఖిల్ తెరంగేట్రాన్ని చూడాలి అన్న కోరికను కూడా తీర్చుకున్నారాయన. 'మనం' సినిమాలో నాగేశ్వరరావు కోసమే, అఖిల్ స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేశారు. కొడుకు నాగార్జున, మనవడు చైతూలతో పోటీ పడి నటించారు. కుటుంబ సమేతంగా హాయిగా ఫీలవుతూ చూడదగ్గ చిత్రమది. ఆయన నట జీవితంలో ఆఖరి చిత్రం. ఎప్పటికీ గుర్తుండిపోయే విభిన్న చిత్రం. 'మనం' షూటింగ్ చివరి దశలో ఉండగానే అక్కినేని నాగేశ్వరరావు కాలం చేశారు.
అలాంటి గొప్ప వ్యక్తి జీవిత గాథ కూడా ఈ తరం వారికి ఎంతో స్పూర్తిదాయకం. ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తున్న ఈ తరుణంలో అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌ని కూడా తెరకెక్కించే అవకాశాలు లేకపోలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. అయితే తాతగారి బయోపిక్ మామయ్య చేతిలో ఉందని సమాధానమిచ్చి సుమంత్ తప్పించుకున్నాడు.