స్టార్ దర్శకులందరితోనూ పనిచేశాడు రామ్ చరణ్. ఒక్క త్రివిక్రమ్, కొరటాల శివలతో తప్ప. ఓసారి కొరటాల శివ సినిమా ఓపెనింగ్ కూడా జరుపుకుని ఆగిపోయింది. ఇప్పుడు `ఆచార్య`లో చరణ్‌కి నటించే ఛాన్సొచ్చింది. కానీ... ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో తెలీదు. ఆర్.ఆర్.ఆర్ వల్ల `ఆచార్య`కి చరణ్ డేట్లు సర్దుబాటు చేయగలడా? లేడా? అనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ చేసినా, ఇది సోలో హీరో సినిమా కాదు. చిరు సినిమాగానే చలామణీ అవుతుంది. మరోవైపు రెండు మూడేళ్ల నుంచి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని తహతహలాడిపోతున్నాడు చరణ్.
ఇప్పుడు ఈ రెండు సినిమాల ఆఫర్లూ చరణ్‌ని ఒకేసారి చుట్టుముట్టాయి. ఆర్.ఆర్.ఆర్ అవ్వగానే - కొరటాల శివతో సోలో హీరోగా సినిమా చేయాలని ఫిక్సయ్యాడు చరణ్. కానీ ఇంతలోనే త్రివిక్రమ్ సినిమా కూడా ఒకే అయ్యేట్టు కనిపిస్తోంది. చరణ్ - త్రివిక్రమ్ ల కాంబోలో ఓ సినిమా రాబోతోందని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ తో సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ ఈ సినిమా మొదలెట్టేస్తాడట. అంటే ఆర్.ఆర్.ఆర్ అయిన తరవాత.. చరణ్‌కి పెద్దగా గ్యాప్ ఉండదు. అటు త్రివిక్రమ్, ఇటుకొరటాల ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా సందిగ్థకరమైన పరిస్థితే.
ఇద్దరూ టాప్ డైరెక్టర్లే. ఏ ఒక్కరినీ చరణ్ నో చెప్పలేడు. ఓ సినిమా ఒప్పుకుంటే... మరొకరితో కాంబినేషన్ కుదరడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. మరి.. ఈ సందిగ్థంలోంచి చరణ్ ఎలా బయటపడతాడో? ఎవరికి నో చెబుతాడో చూడాలి.