ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ ఈ స్థాయిలో క్రేజ్ రాలేదు. సినిమాకి క్రేజ్ రావడం ఓ ఎత్తు. కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించేయడం ఇంకో ఎత్తు. అవునండీ ఇదంతా 'రంగస్థలం' సినిమా కోసమే. మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలైన తొలి రోజునుండీ ఒకే రకమైన ప్రతాపం చూపిస్తోంది కలెక్షన్స్‌లో 'రంగస్థలం'. ఓ నాన్ కమర్షియల్ మూవీ 200 కోట్ల క్లబ్‌లో చేరడం, కనీ వినీ ఎరుగని రీతిలో షేర్స్ సంపాదించి పెట్టడం తెలుగులో ఇదే మొదటిసారి. ఇంకా ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమాకి షేర్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రకంగా ఆడిన మరో చిత్రం లేదు. అందుకే చెప్పుకోదగ్గ సెంటర్స్‌లో ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట.
చాలా గ్రాండ్‌గా ఈ ఫంక్షన్ నిర్వహించాలని భావిస్తోందట. వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైద్రాబాద్ ఈ నాలుగు సెంటర్స్‌లో ఎక్కడో ఓ చోట ఈ ఫంక్షన్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, టాలీవుడ్‌లోని అగ్ర హీరోలంతా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్‌పై కనిపించే అవకాశాలున్నాయనీ సమాచారమ్.
ఇదే జరిగితే, అభిమానులందరికీ పండగే పండగ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం'లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత జంటగా నటించారు.