బాలీవుడ్ లో తెలుగు సినిమా స్టామినాని మరోసారి గట్టిగా చూపించేసింది పుష్ప. ఈ సినిమా పాండమిక్ లో కూడా రూ.100 కోట్లు సాధించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాలీవుడ్ సినిమాలు సైతం వసూళ్లురాబట్టుకోలేక బోల్తా పడుతున్న వేళ.. ఓ డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం నిజంగా షాక్ ఇచ్చే విషయమే. అందుకే.. రెండేళ్ల క్రితం విడుదలైన `అల వైకుంఠపురములో` సినిమా హిందీ వెర్షన్ ని ఇప్పుడు బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. సరిగ్గా రామ్ చరణ్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. 2018లో విడుదలైన `రంగస్థలం` హిందీ వెర్షన్ ని ఇప్పుడు బాలీవుడ్ లోకి వదలడానికి సిద్ధం అవుతున్నాడని టాక్.
ఆర్.ఆర్.ఆర్ వల్ల చరణ్ బాలీవుడ్ జనాలకు బాగా దగ్గరయ్యాడు. పైగా ఇది సుకుమార్ సినిమా. పుష్ప బ్రాండ్ ఇమేజ్ `రంగస్థలం` హిందీ వెర్షన్ కి బాగా ఉపయోగపడుతుంది. పైగా పుష్ప, రంగస్థలం రెండూ మైత్రీ మూవీస్ సినిమాలే. అలా.. రంగస్థలం కూడా మంచి వసూళ్లని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ థియరీ వర్కవుట్ అయితే.. చరణ్, బన్నీ, ఎన్టీఆర్‌లు చేసిన పాత సినిమాలు సైతం డబ్బింగ్ రూపంలో బాలీవుడ్ వెళ్లిపోతాయి. ఇది మరో రకమైన మార్కెట్‌కి నాంది పలుకుతుంది.