శంకర్ సినిమాలన్నీ భారీగానే ఉంటాయి. ఇండ్రస్ట్రీకి కాస్ట్లీ అనే పదాన్ని పరిచయం చేసింది ఆయనే. ఒక్కో పాటకే ఐదారు కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు. ప్రపంచంలోని వింతలూ విడ్డూరాలన్నీ చూపిస్తుంటారు. ఇక నటీనటుల విషయానికొస్తే... సరిహద్దులు దాటేస్తుంటారు. పైగా ఇప్పుడు పాన్ ఇండియా హవా నడుస్తోంది. ఓ సినిమా వస్తోందంటే అందులో కలగూర గంపలా దేశంలోని స్టార్లంతా ఉండాల్సిందే అన్నట్టు తయారైంది వ్యవహారం.
ఇప్పుడు శంకర్ - రామ్ చరణ్‌ల కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ భారీ తారాగణం కనిపించబోతోంది. ఆ లిస్టు చూస్తుంటే... అందరికీ మతి పోతోంది. చరణ్ - శంకర్ ల సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం సల్మాన్ ఖాన్ (హిందీ వెర్షన్)ని తీసుకోబోతున్నార్ట. అదే పాత్రని తమిళంలో విజయ్‌సేతుపతితో, కన్నడలో ఉపేంద్రతో చేయించబోతున్నార్ట. తెలుగులో ఆ పాత్ర చిరు, లేదా పవన్‌లతో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నార్ట. ఇదంతా ఇప్పుడు చర్చల దశలో ఉన్న విషయాలు. పేపర్ మీద ఇంతమంది స్టార్లని చూస్తుంటే ఇలా ఉంటే.. తెరపై అందరూ దర్శనమిస్తే ఎలా ఉంటుందో?