ఛలో, భీష్మ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. రెండూ సూపర్ హిట్లే. భీష్మ తరవాత... వెంకీ కుడుములకు పెద్ద హీరోల నుంచి పిలుపొచ్చింది. ఈ క్రమంలో రామ్ చరణ్ ని కలిశాడు వెంకీ. ఇద్దరి మధ్య సినిమా చర్చలు కూడా మొదలయ్యాయి. చరణ్ కోసం వెంకీ ఓ లైన్ రెడీ చేశాడు కూడా.
అయితే.... ఏమైందో తెలీదు గానీ, ఆ కథ ఇప్పుడు మహేష్ బాబు చెంతకు చేరిందని సమాచారం. ఈమధ్య లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు కొత్త కథలు వినడం మొదలెట్టాడు. కొంతమంది యువ దర్శకుల్ని కలుసుకున్నాడట. ఆ సందర్భంగా వెంకీ కుడుముల కూడా కలిశాడని, చరణ్ కోసం సిద్ధం చేసిన కథని, మహేష్ కి వినిపించాడని, ఆ కథకు మహేష్ ఓకే చెప్పాడని సమాచారం. కాకపోతే... మహేష్ తో సినిమా అంటే ఇప్పుడు ఒకటే ఇబ్బంది.
మహేష్ కోసం కనీసం రెండు మూడేళ్లు ఆగాలి. వెంకీ కుడుముల అప్పటి వరకూ ఆగేలా లేడు. 2021లో ఓ కొత్త సినిమా మొదలెట్టాలని చూస్తున్నాడు. మహేష్ అయితే అప్పటికి ఎలాగూ రెడీ కాడు. సో... ఈ కథ.. మహేష్ నుంచి కూడా చేజారిపోయే ఛాన్సులే ఎక్కువని తెలుస్తోంది. కాకపోతే.. చరణ్, మహేష్‌లకు కథలు చెప్పి వాళ్ల దృష్టిలో పడగలిగాడు వెంకీ కుడుముల.