'చందమామ కథలు' వంటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఇటీవలే రాజశేఖర్‌తో 'గరుడవేగ' చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అందరూ మర్చిపోయిన ఓ సీనియర్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే రిస్క్ చేసిన ప్రవీణ్ సత్తారు సాహసాన్ని అంతా మెచ్చుకున్నారు.
అందుకు తగ్గట్లుగానే తన నైపుణ్యంతో ఎప్పటి నుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్‌కి హిట్ ఇవ్వడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్‌గా మరోసారి ప్రవీణ్ సత్తారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడట. ఆ యంగ్ హీరో నితిన్ అని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైందో తెలీదు కానీ, ప్రస్తుతం మరో యంగ్ హీరో ప్రవీణ్ సత్తారు లిస్టులోకి వచ్చి చేరాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు అందగాడు రామ్.
'నేను శైలజ' సినిమాతో హిట్ కొట్టి, మళ్లీ అదే డైరెక్టర్‌తో 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో నటించిన రామ్, రెండో ప్రయత్నంలో ఫ్యాన్స్‌ని నిరాశ పరిచాడు. అందుకే ఈ సారి మనోడు అవార్డు విన్నింగ్ మరియు సూపర్ సక్సెస్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో సినిమాకి సై అంటున్నాడనీ తాజా సమాచారమ్. అయితే రామ్ మరోవైపు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్‌ని కూడా త్వరలోనే రామ్ పట్టాలెక్కించనున్నాడనీ తెలియవస్తోంది.
రెండు సినిమాలూ సమాంతరంగా పూర్తి చేసే యోచనలో ఉన్నాడట మనోడు. తన తోటి హీరోలు శర్వానంద్, నాని ఏడాదికి రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అదే రూటులో ఇకపై రామ్ కూడా వెళ్లాలనుకుంటున్నాడట. అందుకే జోరు పెంచాడనీ తెలియవస్తోంది. చూడాలి మరి రామ్ నిజంగానే జోరు పెంచాడా? లేక జస్ట్ గాసిప్సేనా అనేది తేలాల్సి ఉంది.