వర్మ రంగంలో దిగేశాడు. కొత్త టైటిళ్లతో వచ్చేశాడు. వర్మ వైకాపా కోసం మూడు సినిమాలు తీయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా కథనాలు సాగుతున్న నేపథ్యంలో వర్మనే స్వయంగా తన సినిమాల గురించి ప్రకటన ఇచ్చేశాడు. తను రాజకీయ పరమైన సినిమాలు తీస్తున్నట్టు, అవి రెండు భాగాలుగా రాబోతున్నట్టు వాటికి వ్యూహం, శపథం అనే పేర్లు పెట్టినట్టు వర్మ ట్విట్టర్ సాక్షిగా చెప్పేశాడు. ``నేను అతి త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. అది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు. కానీ రియల్ పిక్‌లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయి`` అని ఓ ట్విట్ చేశాడు.
''అహంకారానికీ, ఆశయానికీ మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషయంతో నిండి ఉంటుంది. రాజకురుపు పై వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే వ్యూహం సినిమా'' అని మరో ట్విట్ జోడించాడు. ఈ చిత్రాలకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు వర్మ. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం' చూసి ఆ షాక్ నుంచి తేరుకొనే లోపే.. వాళ్లకు ఇంకో ఎలక్ట్రిక్ షాక్ `శపథం`తో తగులుతుందని.. ఊరిస్తున్నాడు వర్మ.