ట్రెండింగ్ టాపిక్స్ ను పట్టుకుని సినిమాలు తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ ను మించినవారు లేరు. అయితే ఆయన ప్రకటించిన అన్ని సినిమాలు పట్టాలెక్కుతాయా, అవన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తాయా అనేది మాత్రం చెప్పలేం. ఈమధ్యే ఆర్జీవీ 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ'(గాంధీని చంపిన హంతకుడు) అనే సినిమాను ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం నాగబాబు మహాత్మా గాంధీ హంతకుడు అయిన నాథూరామ్ గాడ్సే గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, అవి వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ సినిమా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తించింది.
అయితే నిన్న ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక కొత్త పోస్టర్ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో సగం గాంధీ మొహం, సగం గాడ్సే మొహం కలిసి ఉంది. దీంతో ప్రముఖ హ్యూమనిస్టు బాబు గోగినేని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆర్జీవీని తీవ్రంగా విమర్శిస్తూ ఓ పోస్టు పెట్టారు. హతులైనవారిని, హంతకుడిని కలిపి ఇలా పోస్టర్ చేయడం దుష్టత్వం. ఇలా చేయడం మనిషి ప్రాణానికి కనీసపు విలువ కూడా ఇవ్వకపోవడం, మతిలేనితనం అంటూ మానవతావాదానికి సంబంధించిన విప్లవ భావాలను వ్యక్తపరుస్తూ పదునైన విమర్శలు చేశారు. ఈ పోస్టర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ ఎక్కువ సమయం తీసుకోలేదు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా బాబు గోగినేని పోస్టుకు రిప్లై ఇచ్చారు. "ఇమేజ్ ని మార్ఫ్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం సినిమా చూసిన తర్వాతే అర్థం అవుతుంది. మీరు ఎలాగైతే దేవుడిని నమ్మేవారిని హర్ట్ చేస్తూ ఉంటారో నేను అలాగే నాకున్న హక్కుల మేరకు నా కళ కోసం ఉపయోగిస్తున్నాను. ఫైనల్ ప్రోడక్ట్ చూడకుండా మీరు ఇలా విరుచుకుపడడం సరికాదు. మీరు చల్లటి బీరు తీసుకుని సల్లబడండి" అంటూ ఆంగ్లంలో ట్వీటారు. మరో ట్వీట్ లో "వాక్ స్వాతంత్రం అనేది ఒక వ్యక్తిని హర్ట్ అయిన వ్యక్తుల నుంచి రక్షించేది. ఎవరి మనోభావాలు దెబ్బతినని పక్షంలో అసలు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఎందుకు?" అంటూ ఓ లాజిక్ చెప్పారు. దీనికి గోగినేని గారు ఏం బదులిస్తారో వేచి చూడాలి!