గత కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. కారణం వ్యూహం సినిమా టైంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లని అవమానించారని ఏపీలో పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలు పోలీసులు స్వయంగా వర్మ ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు. ఈ క్రమంలో వర్మ ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం తప్పే అని, ఆ విషయంలో పోలీసుల చర్యల్ని తప్పు పట్టి అరెస్ట్ ని ఆపలేమని కోర్టు తీర్మానించింది. దీనితో రామ్ గోపాల్ వర్మ విచారణకి వెళ్లాల్సి వచ్చింది. మొదట 19 న అటెండ్ అవ్వాల్సి ఉండగా నాలుగు రోజులు గడువు అడిగారు. తరవాత 25 న కూడా వర్మ విచారణకి రాకపోవటంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్లగా లేరు.
దీనితో వర్మ విచారణకి, అరెస్ట్ కి భయపడి పారిపోయాడని, అన్నిటిలో తెగించే వర్మ చిన్న కేసులో బయపడుతున్నారు, అరెస్ట్ చేస్తే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని బయపడుతున్నారని, వర్మ ఇంత పిరికివాడా? బయటకి కనిపిస్తున్నంత డేరింగ్ లేదా అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో వర్మ మాట్లాడుతూ 'నేను ఏడాది క్రితం ఏదో ట్వీట్ పెట్టాను, అనేది ఆరోపణ. ఆ ట్వీట్ పై ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్స్ కి నాలుగు డిఫరెంట్ ప్లేసెస్ లో, నాలుగు రోజుల వ్యవధిలో, నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ తాను ఎవరిపై ట్వీట్లు పెట్టానో వాళ్ల మనోభావాలు దెబ్బతినలేదు' అని వర్మ పేర్కొన్నారు.
'థర్డ్ పార్టీ వాళ్ళు, ఏ మాత్రం సంబంధం లేనివాళ్లు కేసు పెట్టడం, అసలు ఇది కేసు ఎలా అవుతుందనేది నా అనుమానం, ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను పావులుగా చేసుకుని ఆడిస్తున్నారు. అమెరికాలో, యూరప్ లో జరిగినట్లే ఇక్కడ కూడా జరుగుతోందని, నేను ఏ పోలీసు అధికారిని, రాజకీయ నాయకుడిని కానీ బ్లేమ్ చేయడం లేదు. నాకు ఒక నోటీసు వచ్చింది, నేను ఫలానా రోజు వస్తానని రిప్లై ఇచ్చాను. కానీ షూటింగ్ కారణంగా విచారణకి వెళ్ళలేదు, ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుందని ఆలోచించా, అయినా ఇదేం అర్జెంట్ కేసు కాదు కదా అని వర్మ ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.