అక్టోబర్‌లో తెలుగు సినిమాలు సృష్టించబోయే సంచలనాల గురించి చాలా చర్చ జరిగింది. జరుగుతూనే ఉంది. అయితే 'నోటా' నిరాశపరిచింది. దాంతో అందరి దృష్టి 'అరవింద సమేత..' పై పడింది. 'అరవింద' ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటి దాకా ఉన్న అంచనాలు రెట్టింపైపోయాయి.
ఇక ఈ దసరా సీజన్‌లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'హలో గురూ ప్రేమ కోసమే'. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఈ మూవీ సరిగ్గా దసరా రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా సెలవులు ముగుస్తున్న టైంలో వచ్చే ఈ సినిమా ఎంతవరకూ వసూళ్లను రాబడుతుంది అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే సినిమాపై అంచనాలు బిల్డప్ అవుతూ వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.
ఇదొక క్లీన్ లవ్ స్టోరీ అట. అనుపమతో రామ్ కెమిస్ట్రీ చాలా బాగా పండిందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఉన్నది ఒక్కటే జందగీ' సినిమా వచ్చింది. ఆ సినిమా ఫర్వాలేదనిపించింది. ఈ సారి మాత్రం ఈ పెయిర్ సూపర్ హిట్ కొట్టబోతోందట. నక్కిన త్రినాధరావు ఈ చిత్రానికి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కాబోతోంది.
ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు ఆకట్టుకుంటున్నాయి.