రామ్... ఎనర్జీకి మారు పేరు. సరైన కథ పడాలే గానీ, తన రేంజ్ చూపించేస్తాడు. ఇస్మార్ట్ శంకర్ తో బాక్సాఫీసుని ఓ ఊపు ఊపేశాడు. ఇప్పుడు ది వారియర్‌తో సిద్ధం అవుతున్నాడు. గురువారం ఈ సినిమా విడుదల కానుంది. దీని తరవాత.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే రామ్ కోసం చాలా మంది దర్శకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు.
హరీష్ శంకర్ తో రామ్ ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరవాత.. అనిల్ రావిపూడితోనూ జట్టు కట్టబోతున్నాడు. పూరితో మరో సినిమా చేయాలని ఇటీవలే రామ్ తన మనసులోని మాట బయటపెట్టాడు. అన్నీ కుదిరితే.. పూరితో కూడా ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది. ఓ తమిళ డైరెక్టర్ కూడా రామ్ కోసం తిరుగుతున్నాడని, కథ చెప్పి ఒప్పించేప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది.
ది వారియర్ దర్శకుడు లింగుస్వామి తమిళం నుంచి వచ్చిన వాడే. వారియర్ హిట్టయితే.. రామ్ భవిష్యత్తులో మరికొంత మంది తమిళ దర్శకులకు అవకాశాలు ఇచ్చేవీలుంది. ఎలా చూసినా. రెండేళ్ల వరకూ రామ్ కాల్షీట్లు ఖాళీ లేవు. రామ్ కోసం కథలు తయారు చేసుకొనే వాళ్లు ఇంకొంత కాలం ఆగాలి.