రమణ గోగుల అంటే మనకి ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ, గాయకుడిగానూ మాత్రమే తెలుసు. కానీ ఆయనకు బెంగుళూరులో ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆయన ఓ పెద్ద పారిశ్రామికవేత్త. అయితే ఆయనకి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి ఆ దిశగానూ తన కళాత్మకతను చాటుకున్నారు. అయితే తాజాగా హైద్రాబాద్‌లో ట్రంప్ కూతురు ఇవాంకా హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సుకు రమణ గోగుల కూడా హాజరవుతున్నారు. ఈ వేదికపై ఆయన కూడా ప్రసంగించనున్నారు.
రైతులకు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారి జీవన విధానంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని రమణ గోగుల అన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న రైతులను ఆదుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టామనీ, రైతులకు కావాల్సిన సదుపాయాలను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపొందిస్తున్నామనీ రమణ గోగుల అన్నారు.
దేశ వ్యాప్తంగా రైతుల కోసం పనిచేసే వివిధ స్టార్టప్ కంపెనీలను బలోపేతం చేసేందుకు ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం అంటూ, ఈ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించే ప్రసంగంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ అంతర్జాతీయ సదస్సు హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుండి పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఇవాంకా ట్రంప్‌తో సహా, మన తెలుగు రాష్ట్రాల నుండి పలువురు పారిశ్రామిక వేత్తలు తన అమూల్యమైన ప్రసంగాల్ని ఇవ్వనున్నారు.