తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఇతిహాసాలు రామాయణ, మహాభారతాలు. ఏ కథలు తీసుకున్నా, వాటికి మూలాలు వీటి నుండి పుట్టినవే అనడం అతిశయోక్తి కాదు. అంతలా ఈ కథలు మానవ మనుగడపై ప్రభావితం చూపాయి. అయితే, ఇంతవరకూ చాలా సినిమాలు వీటిని అనుబంధంగా చేసుకుని తెరకెక్కాయి. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి కూడా.
అయితే, వీటిని సాంఘిక కథలుగా మార్చి నేటి తరుణంలో సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఎప్పటి నుండో రామాయణాన్ని తెరకెక్కించేందుకు కొందరు ప్రముఖ దర్శక, నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్టకేలకు రామాయణాన్ని మోడ్రన్ వెర్షన్‌లో సినిమాగా తెరపై ఆవిష్కరించేందుకు నిర్మాతలు కుదిరారు. తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా త్రయం ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చారు.
'దంగల్' దర్శకుడు నితీష్ తివారి, 'మామ్' దర్శకుడు రవి ఉద్యావర్ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, హీరో, హీరోయిన్లు ఇతర టెక్నీషియన్ల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, రామాయణంలో నటించాలన్నది అమీర్‌ఖాన్ కోరిక. ఈ ప్రాజెక్ట్‌ని ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా టేకప్ చేస్తున్నారు. కాబట్టి, భాషతో సంబంధం లేకుండా, తెలుగు, తమిళ, హిందీ భాషల నుండి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించే అవకాశముంది. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమా రూపొందనుంది.