అభిమానులంటే తమ అభిమాన హీరో సినిమాకి హడావిడి చేయడం, ఒక్కటే కాదు, తమ అభిమాన హీరోల పిలుపుతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ, పేదలకు అండగా ఉంటూ ఆరిక సహాయం కూడా అందిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పారనే, వందలాది మంది అభిమానులు నేత్రదానం, రక్తదానానికి ముందుకొచ్చారు. తాజాగా భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అసోంలో వరదల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయిపోతోంది. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక అక్కడి ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అక్కడి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తానే కాదు, మెగా అభిమానులందర్నీ అలర్ట్ చేశారు. దాంతో అక్కడి మెగా అభిమానులు ఇప్పటికే రంగంలోకి దిగి, బాధితులకు అండగా నిలిచారు. మరో పక్క రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా వరద బాధితులకు అండగా నిలిచేందుకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేశారు. మాకు తోచింది మేం చేశాం. మీ వంతుగా మీకు తోచిన రూపాయిని విరాళంగా ఇవ్వండి అంటూ పోస్ట్ చేసి, ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకునేందుకు, ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఆమె కోరింది. మెగా పిలుపుతో పలు చోట్ల నుండి అభిమానులు అసోం ప్రజలను ఆదుకునేందుకు ముందు వచ్చారు. తమకు తోచినంత సాయం చేస్తూ, ఓ సైన్యంగా మారి, బాధితులను ఆదుకోవడంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.