ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా 'రొమాంటిక్'. ఇటీవలే గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట.
గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించింది. అలాగే నాగచైతన్యకి అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ అత్తగా కనిపించి అలరించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది. ఏమైనా ఇలాంటి అత్త పాత్రలను చేయడంలో ఈ జనరేషన్ లో రమ్యకృష్ణకు మించినోళ్లు లేరు. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ 'రొమాంటిక్' సినిమా నుండి ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను బాగా పెంచింది.
ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.