తొలి సినిమా లీడర్ లో రానాని చూసిన వారంతా అన్నమాటొక్కటే.. రా మెటీరియల్.. కొందరైతే రానా సినిమాలు చూడకూడదని మొదట్లో ఫిక్సయ్యారు కూడా.. అందుకే తర్వాత చేసిన నేనూ నా రాక్షసి పర్లేదనిపించినా ఆడలేదు..కానీ ఇప్పుడు రానా నటునిగా ప్రపంచానికి తెలుసు. అతను ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్. రానా ఇంతగా ఎదగడానికి ప్రధానకారణం రానానే.. సినిమా సినిమాకీ నటనని పదును పెట్టుకుంటూ.. కెరీర్‌ని తనే డిజైన్ చేసుకుంటూ దేశం మెచ్చే నటుడనిపించుకున్నాడు..
సురేశ్ ప్రొడక్షన్స్ సొంత సంస్థే అయినా.. రానాతో ఆ సంస్థ నిర్మించిన సినిమా ఒక్కటే.. అదే.. నేనే రాజు నేనే మంత్రి. అది కూడా రానా హీరోగా నిలదొక్కుకున్న తర్వాత. సొంత సంస్థను నమ్ముకోకుండా స్వయం శక్తితో ఈ స్థాయికి ఎదిగాడు రానా. పది సినిమాలు తెలుగులో.. ఎనిమిది సినిమాలు హిందీలో.. ఎనిమిది సినిమా తమిళంలో చేశాడు.. ఈ రోజు బాలీవుడ్ జనాలు రానా అంటే మా హీరో అంటారు.. ఇది నిజంగా తెలుగులో ఏ హీరోకీ దక్కని అదృష్టం.
ఇక బాహుబలి సిరీస్‌లో భల్లాలదేవుడిగా రానా నటన గురించి చెప్పాలంటే పేజీలు పేజీలు రాయాలి. తెలుగులో కృష్ణంవందే జగద్గురు, ఘాజీ, నేనేరాజు నేనేమంత్రి ఇలా ఒకదానికొకటి సంబంధంలేకుండా వైరైటీ పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ నటునిగా ఎదుగుతున్నాడు రానా.. రేపు ఏప్రిల్ 2న రాబోతున్న బహుభాషాచిత్రం హతీ మేరే సాథీ లో రానా స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయ్. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతున్న 1945, విరాటపర్వం చిత్రాలు కూడా విభిన్నమైనవే అంటున్నారు.
రానా కెరీర్‌లో రాబోతున్న మరో మైలురాయి హిరణ్యకశిప.. చాలారోజుల తర్వాత రూపొందనున్న పూర్తిస్థాయి పౌరాణిక చిత్రమిది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హిరణ్యకశిపునిగా నటించనున్నాడు రానా.. అప్పట్లో ఎస్వీయార్ చేసిన పాత్రను ఇప్పుడు రానా చేయబోతున్నాడన్నమాట. ఇది మామూలు సాహసంకాదు..
మొన్న ఫిబ్రవరి 19కి రానా తొలి సినిమా లీడర్ విడుదలై పదేళ్లయింది.. నటునిగా పదేళ్లు పూర్తిచేసుకున్న మన దగ్గుపాటివారబ్బాయికి శుభాకాంక్షలు తెలుపుదాం