'భళ్లాలదేవ'గా 'బాహుబలి' సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అత్యుత్తమ నటన కనబరిచాడు రానా. హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే విలన్ పాత్ర ఎంత క్రూరంగా ఉండాలో 'భళ్లాలదేవ' పాత్ర చూస్తే అర్ధమవుతుంది. అలా 'బాహుబలి' సినిమాలో తన ఉత్తమ నటనతో ఆకట్టుకున్నాడు రానా. ఇకపోతే, అదే టైంలో కొత్త డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తలపెట్టిన కొత్త ప్రయోగం 'ఘాజీ' చిత్రంలోనూ రానా లీడ్ రోల్ పోషించి ఆ చిత్ర విజయానికి కూడా కారణమయ్యాడు.
ఇప్పుడీ రెండు సినిమాలు నేషనల్ అవార్డుల్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. 65వ జాతీయ అవార్డుల్లో ఈ రెండు సినిమాలకు ఉత్తమ అవార్డులు దక్కాయి. దాంతో రానాకి సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానాని పొగడ్తలతో ముంచేశాడు. తెలుగు సినిమా గర్వపడేలా చేశాడు రానా అంటూ అవార్డు అందుకున్నందుకు రానాకి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తనకెంతో ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళికి, బాహుబలి చిత్ర యూనిట్‌కీ ఎన్టీఆర్ కంగ్రాట్స్ తెలిపాడు. ఈ విషయంపై రానా కూడా స్పందించాడు.
'ఇంత గొప్ప చిత్రాల్లో తానూ భాగమైనందుకు సంతోషిస్తున్నా, ఈ రెండు చిత్రాల ప్రయాణంలో తన దర్శకులు రాజమౌళి, సంకల్ప్ రెడ్డి నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను, క్యారెక్టర్ కాదు ముఖ్యం, కథే బలం, కథే మూలం అని నమ్మి ఈ రెండు చిత్రాల్లోనూ నటించేందుకు ముందుకొచ్చాను. అందుకు చక్కటి ఫలితం దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని ' రానా చెప్పాడు.