ఎన్నో వ్యయ ప్రయాసలతో రుద్రమదేవి చిత్రాన్ని రూపొందించాడు గుణశేఖర్. అయితే.. తగినంత ప్రతిఫలం మాత్రం లభించలేదు. ఈ సినిమాతో గుణశేఖర్ చాలా నష్టపోయాడు కూడా. ఇప్పుడు తన దృష్టంతా `హిరణ్య`పై పడింది. ఈసినిమాతో ఎలాగైనా సరే, తన మార్క్ చూపించాలని తహతహలాడుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితమే మొదలెట్టినా, ఇప్పటి వరకూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన తయారైంది.
రానా ఈ సినిమాపై దృష్టి పెట్టకపోవడంతో.. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమా గురించి సురేష్ బాబు పెదవి విప్పాడు. ఓ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని చెప్పాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చాడు. దాంతో గుణశేఖర్‌కి ఊరట లభించినట్టైంది. కాస్త ఆలస్యమైనా ఈ ప్రాజెక్టు మొదలవుతుందన్న భరోసా దొరికింది. 2021 ప్రారంభంలో ఈసినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు గుణశేఖర్. దాదాపు 200 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.