శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా `లీడర్`. రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా అది. అప్పట్లో థియేటర్లలో పెద్దగా చూడలేదు గానీ, ఆ తర్వాతర్వాత మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది. ఈ దశాబ్దకాలంలో వచ్చిన మంచి పొలిటికల్ డ్రామా అని విశ్లేషకులు కితాబు ఇచ్చారు. ఆ తరవాత లీడర్ 2 చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ... కుదరడం లేదు. రానా కూడా లీడర్ 2 చేయాలని తహతహలాడుతున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా తరవాత సినిమా పట్టాలెక్కించుకుంటూ వెళ్తున్నాడు కానీ, లీడర్ 2 ఊసు తీయడం లేదు. మరోవైపు రానా మాత్రం `నాకు లీడర్ సీక్వెల్ చేయాలని ఉంది` అని ప్రతీ సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాడు.
తాజాగా తన మనసులోని మాట మరోసారి బయటపెట్టాడు రానా. ``నాకు లీడర్ 2 చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని శేఖర్ కమ్ములతోనూ చెప్పా. ఆయన కూడా కథ రాయడం మొదలెట్టారు. నాకు రెండు మూడు సీన్లు కూడా చెప్పారు. ఆ తరవాత మళ్లీ ఆ ఊసెత్తలేదు`` అని చెప్పేశాడు రానా. శేఖర్ కమ్ముల కూడా లీడర్ 2పై ఆసక్తిగా ఉన్నాడు. కానీ సరైనకథ దొరడం లేదు. లీడర్ 2 పేరుతో మరో రొటీన్ పొలిటికల్ డ్రామా చేయడం శేఖర్ కమ్ములకు ఇష్టం లేదు. మంచి లైన్ కోసం ఆయన అన్వేషిస్తున్నారు. అందుకే ఇంత లేట్. త్వరలోనే ధనుష్ తో ఓ సినిమా చేయబోతున్నారాయన. అది పూర్తవ్వగానే లీడర్ 2 ఉండొచ్చు.