అప్పుడెప్పుడో 'ప్రేమకథ' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు సుమంత్. ఏదో ఒకటీ అరా సక్సెస్‌లు తప్ప, అవేమంత చెప్పుకోదగ్గ హిట్స్ జాబితాలోకి వెళ్లవు. ఇకపోతే హీరోయిజం వదిలేసి, సైడ్ ట్రాక్ ఎక్కేస్తాడనుకున్న సుమంత్ ఇటీవల 'మళ్లీరావా' సినిమాతో ఫామ్‌లోకి వచ్చాడు. 'మళ్లీరావా' తర్వాత సుమంత్ నుండి వస్తున్న సినిమా 'సుబ్రహ్మణ్యపురం'. ఈ వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
బీరం సుధాకర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథా కమామిషు విషయంలోకి వెళ్తే, ఇదో హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఒక ఊరు, ఆ ఊరుకు సంబంధించిన కొన్ని వింతలు, విడ్డూరాలకు హారర్ అంశాలను జోడించి తెరకెక్కించారీ సినిమాని. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన 'కార్తికేయ' సినిమా గుర్తుంది కదా. కాస్త అటూ ఇటూగా ఆ తరహా కాన్సెప్ట్‌తోనే ఈ మూవీ రూపొందిందట. కానీ ఆ సినిమాకీ ఈ సినిమాకీ ఏమాత్రం పొంతన లేదట. 'కార్తికేయ'కు 'సుబ్రహ్మణ్యపురం' సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది కానీ 'కార్తికేయ' సీక్వెల్ నిఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ ప్లేస్‌ని సుమంత్ దక్కించుకునే అవకాశం లేదు. జస్ట్ ఓ ఐడియా కోసం ఆ సినిమాని గుర్తు చేసుకోవడమే.
కానీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లాగే అనిపిస్తోంది 'సుబ్రహ్మణ్యపురం'. తెలుగమ్మాయి ఈషారెబ్బ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నింటికీ మించి భళ్లాలదేవ రానా వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా స్టార్ట్ అవుతుందట. రానా వాయిస్ సినిమా మొదటి నుండి, చివరి వరకూ బ్యాక్‌గ్రౌండ్‌లో కంటిన్యూ అవుతూనే ఉంటుందట. అలా ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో పాటు, రానా వాయిస్ మరో పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. చూడాలి మరి 'మళ్లీరావా'తో బౌన్స్ బ్యాక్ అయిన సుమంత్‌కి 'సుబ్రహ్మణ్యపురం' మరో హిట్ తెచ్చిపెడుతుందో లేదో.!