ఓ సినిమా బిజినెస్‌నీ, మార్కెట్ నీ నిర్ణయించేది సదరు హీరో స్టామినానే. గత సినిమా హిట్టయ్యిందా, ఫ్లాప్ అయ్యిందా? ఎంత వసూలు చేసింది? అనే విషయాలను బట్టే.. ఆ సినిమా బిజినెస్ జరుగుతుంది. నితిన్ గత సినిమా `చెక్` డిజాస్టర్ అయ్యింది. బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఆ బిజినెస్ ప్రభావం నితిన్ కొత్త సినిమా `రంగ్ దే`పై పడుతుందని అనుకున్నారంతా. కానీ విచిత్రంగా `చెక్` కంటే రంగ్ దేకే బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా మొత్తానికి 37 కోట్ల బిజినెస్ జరుపుకుందని ట్రేడ్ వర్గాల టాక్.
ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే... నిర్మాతలు లాభాలు సంపాదించేశార్ట. ఇటీవల ఉప్పెన, జాతిరత్నాలు సినిమాల బాగా ఆడాయి. బయ్యర్ల చేతిలో డబ్బులు గళగళలాడుతున్నాయి. అందుకే.. ఈ సినిమాపైనా నమ్మకం ఉంచి కొనేశారు. పైగా కీర్తి సురేష్ కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్లంతా థియేటర్లకు వస్తే కాసుల పంటే అని జనాలు నమ్మారు. మరి.. `రంగ్ దే` ఆ నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెట్టుకుంటుందో చూడాలి.