ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'రంగస్థలం' సినిమా తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. బాహుబలి తర్వాత ఈ సినిమా గురించే అంత గొప్పగా చెప్పుకున్నారంతా. ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఖాతాలో తాజాగా మరో రికార్డు వచ్చి చేరింది.
ఈ సినిమాలోని 'రంగమ్మా.. మంగమ్మా..' పాటకు యూ ట్యూబ్‌లో 100 మిలియన్ (పది కోట్లు) వ్యూస్ దక్కాయి. ఈ రికార్డు సృష్టించిన తొలి దక్షిణాది పాట ఇది. ఈ పాటలో చరణ్, సమంత గెటప్పులు, డాన్సులు, పాటలోని విరుపులు, వయ్యారాలు.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ పాట అందర్నీ ఆకట్టుకుంది. తక్కువ టైంలో ఇంత ఎక్కువ వ్యూస్ రాబట్టి అందుకే 'రంగమ్మా..మంగమ్మా..' పాట సరికొత్త రికార్డు సృష్టించింది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చరణ్ ప్రయోగాత్మక క్యారెక్టర్‌ని పోషించాడు. పల్లెటూరి చెవిటి కుర్రాడు చిట్టిబాబుగా నభూతో న భవిష్యతి అనదగ్గ స్థాయిలో పర్‌ఫామెన్స్ అదరగొట్టేశాడు. విమర్శకులు, ప్రముఖులు అంతా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
యంగ్ హీరో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ 'రంగమ్మత్త'గా మరో కీలక పాత్రలో కనిపించింది. హాట్ బ్యూటీ పూజా హెగ్దే తొలిసారి ఈ సినిమా కోసం 'జిగేల్ రాజా..' అంటూ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.