తెలుగు సినిమాల జాతర మొదలు కాబోతోంది. 'రంగస్థలం' సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది విడుదల కాబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో 'రంగస్థలం' వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఇక అక్కడితో జాతర మరింత జోరందుకోనుంది.
ఏప్రిల్ తొలి వారంలో వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తాయి. ఆ తర్వాత సినిమాల జోరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న సినిమాలే కాదు, ఓ మోస్తరు భారీ సినిమాలకి సైతం థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. దాంతో, ఏ సినిమా రేసులో వుంటుందో, ఏ సినిమా రేసులోంచి బయటకు తప్పుకుంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
మార్చి నెలాఖరున రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తే, ఏప్రిల్ నెలాఖరున 'భరత్ అను నేను' సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ మధ్యలో డజనుకు పైగా ఓ మోస్తరు సినిమాలు వచ్చేస్తాయి. దేనికదే డేట్స్ ఫైనల్ చేసుకుంటుండడంతో ఏప్రిల్ పోటీ తీవ్రంగా వుండేలానే కన్పిస్తోంది. ఎన్నిసినిమాలొచ్చినాసరే, సెలవుల సీజన్ కాబట్టి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా, సినిమాలకు బాక్సాఫీస్ వసూళ్ళ పరంగా సమస్యేమీ లేదు.
ఏప్రిల్ నెలాఖరు తర్వాత మే నెలలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా వుండనే వుంది. సినిమాలే సినిమాలు, ఒకదాని తర్వాత ఇంకో సినిమా.. ఇంతకీ ఈ సమ్మర్ సూపర్ హిట్ అయ్యేది ఏ సినిమా? ఏ సినిమా బాక్సాఫీస్ వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది? ఇవే ఇప్పుడు అందరి మెదళ్ళలోనూ మెదులుతోన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఈ సమ్మర్ సమాధానం చెప్పనుంది. గెట్ రెడీ ఫర్ సమ్మర్ సినిమాల జాతర.