సినిమా విడుదలై 38 రోజులు కావస్తోంది. మధ్యలో 'భరత్ అనే నేను' వచ్చింది. 'నా పేరు సూర్య' వచ్చింది. అయినా 'రంగస్థలం' హవా కొనసాగుతూనే ఉంది. గ్రాస్ వసూళ్లు 200 కోట్లు దాటేశాయి. షేర్ 125 కోట్లు దాటేసింది. ఇప్పటికీ షేర్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజుల తర్వాత కూడా డెఫిషిట్స్ లేకుండా, తక్కువ మొత్తంలో అయినా, వస్తున్న షేర్స్‌తో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చాలా హ్యాపీగా కనిపిస్తోంది.
లేటెస్టుగా ఆ 'గట్టునుంటావా.. ' ఫుల్ సాంగ్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. రాజకీయాల్లో ఈ పాట మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా చరణ్‌కి 'మగధీర' తర్వాత మరో ఇండస్ట్రీ హిట్ ఇది. వసూళ్ల పరంగా తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 3 పొజిషన్‌లో నిలిచింది. మొదటి సినిమా 'బాహుబలి 2' అయితే రెండోది 'బాహుబలి 1'.
అయితే 'బాహుబలి' విషయంలో వసూళ్ల పరంగా ఈక్వేషన్స్ పూర్తిగా వేరు. ఆ సినిమాని మరే ఇతర సినిమాతోనూ పోల్చి చూడలేం. అది వసూళ్ల పరంగానైనా. మేకింగ్ పరంగానైనా. ఆ లెక్కల్లో చూస్తే 'రంగస్థలం' మొదటి ప్లేస్ అనే చెప్పాలి. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రంగస్థలం' సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1980ల కాలం నాటి స్టోరీగా తెరకెక్కింది. ఆది పినిశెట్టి, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.