2018లో మొదటి సగభాగం పూర్తైపోయింది. మొత్తంగా టాలీవుడ్‌ని ప్రధమార్ధంలో నిలబెట్టిన సినిమాగా 'రంగస్థలం'ను చెప్పుకోవాలి. స్టార్ హీరోగా తన ఇమేజ్‌ని పక్కన పెట్టి చరణ్ చేసిన సినిమా ఇది. ఒక్క సినిమాతో వంద సినిమాల సక్సెస్ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవడమే చరణ్ సాధించిన తొలి విజయం. రిస్క్ చేశాడు. సక్సెస్ కొట్టాడు. విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది 'రంగస్థలం'. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సినిమా రిలీజ్ అయిపోయినా సినిమాకి షేర్స్ ఆగలేదు. ఇప్పటికీ రంగస్థలం సినిమా కొన్ని చోట్ల చెప్పుకోదగ్గ వసూళ్లను రాబడుతోంది. ఈ మధ్య కాలంలో 50 రోజుల సినిమానే మర్చిపోయాం మనం. అలాంటిది 100 రోజుల మజా చూపించాడు రామ్‌చరణ్ 'రంగస్థలం'తో. చరణ్, సమంత, అనసూయ, ఆదిపినిశెట్టి ఇలా సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఇది చాలా చాలా ప్రత్యేకమైన సినిమా.
గ్రామ పెద్దగా నటించిన జగపతిబాబు కావచ్చు. ఐటెం సాంగ్ చేసిన పూజా హెగ్దే కావచ్చు. కమెడియన్ మహేష్ కావచ్చు.. ప్రతీ ఒక్కరూ తమ కెరీర్‌లో దీన్ని ఒక ప్రత్యేకమైన సినిమాగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. సుకుమార్ టేకింగ్, మైత్రీ మూవీస్ మేకింగ్ ఈ 'రంగస్థలం'ను వసూళ్ల కింగ్‌గా మార్చేసింది.