సినిమా విడుదలైన తొలిరోజే పైరసీ.. అయినా, తట్టుకుని నిలబడింది 'రంగస్థలం'. హీరో చెవిటివాడైనాసరే.. సినిమా కథలో సత్తా వుంది. అంతకు మించి, చెవిటి వ్యక్తి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చెలరేగిపోయేసరికి వసూళ్ళ పంట పండింది.
మామూలుగా అయితే 'రంగస్థలం' చాలా రిస్కీ ప్రాజెక్ట్. రిస్క్ చేయకపోతే లైఫ్‌లో రస్క్ కూడా దొరకదు.. అన్న డైలాగ్ పక్కన పెడితే, మెగా పవర్ స్టార్ రిస్క్ చేశాడు.. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ నమోదు చేశాడు. అంతేనా, 'నాన్ బాహుబలి' రికార్డుల్ని కొల్లగొట్టేశాడు. 100 కోట్ల క్లబ్‌లో 'రంగస్థలం' చేరిపోయింది. అంతేనా, బుల్లితెరపైనా 'రంగస్థలం' సత్తా చాటింది.
19.5 టీఆర్పీ రేటింగ్‌తో వారెవ్వా చిట్టిబాబు.. అన్పించేశాడు మెగా పవర్ స్టార్. మామూలుగా అయితే ఇదేమీ అంత పెద్ద టీఆర్పీ రేటింగ్ కాదు. అయినాగానీ, విడుదలైన కొద్ది రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అధికారికంగా ప్రదర్శించేయడం, దానికి తోడు విపరీతమైన పైరసీ.. వీటన్నిటి నడుమ, 'రంగస్థలం' సినిమా బుల్లితెరపై ప్రదర్శించిన రోజున బుల్లితెర వీక్షకుల్ని ఈ స్థాయిలో కట్టి పడేయడమంటే చిన్న విషయం కాదు. ఎలాగైతేనేం, ప్రత్యేక పరిస్థితుల్లోనూ చిట్టిబాబు బుల్లితెరపై అదరగొట్టేశాడు.
ఇప్పుడిక సూపర్ స్టార్ మహేష్‌బాబు వంతు. ఈ వీకెండ్, బుల్లితెర వీక్షకుల ముందుకు రాబోతోంది 'భరత్ అనే నేను' సినిమా. ఈ ఏడాది అత్యధిక వసూళ్ళ చిత్రాల్లో 'భరత్ అనే నేను' రెండో స్థానం దక్కించుకుంది. మరి, బుల్లితెరపై 'భరత్ అనే నేను' టీఆర్పీ రేటింగ్ వాటా ఎంత.? వేచి చూడాల్సిందే.