2018 సినీ పరిశ్రమకు చాలా ప్రత్యేకం. 'బాహుబలి'ని మించిన విజయం ఈ ఏడాదిలో ఏదన్నా సినిమా సాధిస్తుందా? అనే అంచనాలే అందుకు కారణం.
పవన్ కళ్యాణ్ ఆ రికార్డుల్ని తిరగరాస్తాడని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి 'అజ్ఞాతవాసి' చాలా పెద్ద షాక్ ఇచ్చింది. ఇక తెలుగు సినిమా కోలుకోవడం చాలా కష్టం అనుకున్నారు. ఎందుకంటే 'అజ్ఞాతవాసి'పై ఉన్న అంచనాలు అలాంటివి. ఆ సినిమా సాధించిన డిజాస్టర్ అలాంటిది. 'భాగమతి' ఫర్వాలేదనిపించినా, ఇండస్ట్రీ హిట్ అనదగ్గ చిత్రం కోసం ఎదురు చూపులు, అనుమానాలు పెరిగిపోయాయి.
సరిగ్గా ఈ టైంలో 'రంగస్థలం' సినిమా వచ్చింది. సినిమా ఓ పది రోజుల్లో విడుదలవుతుందనగా, ఆ.! ఏముంటుందిలే సినిమాలో. ఎంత బాగా చేసినా, నటుడిగా చరణ్‌కి ఓకే అనిపించే సినిమా అవుతుందిది. సినిమా కోసం చేసిన ఖర్చు తిరిగి రావడం కష్టమే వంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ 'రంగస్థలం' డే 1, తెలుగు సినీ పరిశ్రమ, ప్రేక్షక లోకం ఆలోచనను మార్చేసింది. హిట్ సినిమా కాస్తా, బంపర్ హిట్ అయ్యింది. సినిమాలో ఏముంది అనే విషయం చాలా రోజుల పాటు కథలు కథలుగా చర్చించుకున్నారు.
ఇంతలా ఇటీవల కాలంలో చర్చ జరిగిన సినిమా ఇంకోటి లేదు. అందరి నోటా ఒకటే మాట. చిట్టిబాబు అదరగొట్టేశాడని. చరణ్ కాస్తా చిట్టిబాబుగా కొత్త పిలుపు తాలూకు ఆనందాన్ని ఆస్వాదించాడు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. నాన్ బాహుబలి రికార్డులు గల్లంతైపోయాయి. 125 కోట్లు వసూళ్లు కొల్లగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా మంచి విజయాన్ని అందుకున్నా, వసూళ్ల విషయంలో నిర్మాతలు సృస్టించిన గందరగోళం ఆ సినిమా విజయాన్ని తక్కువ చేసింది.