ముద్దుగుమ్మ రాశీఖన్నా పాటల జోరు పెంచేసింది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకే అందం, అభినయంతో ఆకట్టుకుంది. మంచి హిట్ కూడా తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ 'జోరు' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయితేనేం ఈ సినిమా కోసం అమ్మడు తన గొంతు సవరించుకుంది. పొట్టి గౌను వేసుకుని 'జోరు' టైటిల్ సాంగ్ జోరు జోరుగా పాడేసింది. తొలి సినిమాతోనే కాకుండా, ఈ పాటతోనూ అమ్మడు కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గానే ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంది.
కానీ సింగింగ్ వైపు దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ భామ ట్రాక్ మార్చేసింది. ఓ పక్క యాక్టింగ్‌తోనూ, మరో పక్క సింగింగ్‌తోనూ దూస్కెళ్లిపోతోంది. ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'జవాన్' సినిమాలో ఓ పాట పాడింది రాశీఖన్నా. తేజు కోసమే ఈ బ్యూటీ పాటేసుకుంది ఈ సినిమాలో. 'సుప్రీమ్' సినిమాలో తేజుతో జత కట్టిందీ బ్యూటీ. ఆ సినిమా టైంలోనే అమ్మడి టాలెంట్ పసిగట్టిన తేజు 'జవాన్'లో ఓ పాట పాడమని ఆడగ్గా, అమ్మడు సరే అనేసింది. ఓ రొమాంటిక్ సాంగ్‌కి తను గొంతు కలిపింది. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు తేజుకి, 'జవాన్' డైరెక్టర్ బి.వి.యస్.రవికి థాంక్స్ చెప్పింది రాశీఖన్నా.
కాగా ఇప్పుడు మరో పాట పాడింది. నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతోన్న 'బాలకృష్ణుడు'లో రాశీఖన్నా మరో పాట పాడింది. ఈ పాట ప్రస్తుతం నెట్‌లో హల్ చల్ చేస్తోంది. పాటల సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'తొలిప్రేమ' సినిమాలో నటిస్తోంది. రవితేజతో 'టచ్ చేసి చూడు' సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. ఇటీవలే 'జై లవకుశ' సినిమాలో ఎన్టీఆర్‌తో జత కట్టింది. ఇలా ఓ పక్క సింగింగ్ టాలెంట్, మరో పక్క యాక్టింగ్ టాలెంట్‌తోనూ.. అబ్బో! యమా బిజీగా గడిపేస్తోంది బ్యూటీ రాశీఖన్నా.