షూటింగులకు తెలంగాణా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ఫిలింమేకర్లు షూటింగులకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకా మొదలు పెట్టలేదు కానీ త్వరలో షూటింగులు ప్రారంభించేందుకు రెడి అవుతున్నారు. అయితే కొందరు నటీనటులు మాత్రం ఇప్పుడే కాదు, మరి కొన్ని రోజులు ఆగుదాం అని డైరెక్ట్ గానే చెప్తున్నారట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించేందుకు 'పుష్ప' టీం సన్నాహాలు చేసుకుంటున్నారట.
హైదరాబాద్ లో ఒక విలేజ్ సెట్ ఓ ఇండోర్ షూటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ విషయం రష్మికకు వివరించి షూటింగులో జాయిన్ అవ్వాలని కోరితే రష్మిక మాత్రం మరో మూడు నెలల పాటు షూటింగ్ లో పాల్గొనలేను అని చెప్పిందట. తర్వాత కూడా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో 'పుష్ప' టీమ్ ఇప్పుడు అలోచనలో పడిపోయారట. ఇది ఒక్క 'పుష్ప' టీమ్ ఎదుర్కొంటున్న సమస్య కాదని, పలు సినిమా యూనిట్లు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.
ఈ విషయంలో నటీనటులను కూడా పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో జాగ్రత్తలు తీసుకోగలరు కానీ కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ రాదని ఎవరూ హామీ ఇవ్వలేరు. మరి ఇలాంటి అడ్డంకులను దర్శక నిర్మాతలు ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.