ఎందుకో.. ఈమధ్య రష్మిక టైమ్ అస్సలు బాలేదు. చీటికి మాటికీ నోరు జారుతోంది. కాంతార విషయంలో కన్నడీగుల మనసుల్ని నొప్పించిన రష్మిక.. ఇప్పుడు తెలుగు అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. తెలుగు పాటల గురించి రష్మిక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇవే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
తెలుగు పాటలు దాదాపుగా అన్నీ ఐటెమ్ నెంబర్స్ అని, మసాలా పాటలని మెలోడీ, రొమాంటిక్ సాంగ్స్ వినాలంటే... హిందీ పాటలే అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది రష్మిక. హిందీ అభిమానుల మనసుల్ని గెలుచుకోవడానికి ఇలాంటి పోలికలు తీసుకొచ్చింది రష్మిక. అయితే హిందీ వాళ్ల ని మెప్పించడానికి తెలుగు పాటల్ని తక్కువ చేసి చూడడం ఏమాత్రం అవసరం లేదు. తెలుగు చిత్రసీమలో ఉంటూ, తెలుగు సినిమాలు చేస్తూ.. తెలుగు పాటల్ని ఇలా కించపరచడం పెద్ద తప్పే. అందుకే నెటిజన్లు రష్మికతో మళ్లీ ఆడుకోవడం మొదలెట్టారు.
అయితే ఇంకా తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్? తెలుగు పాటల్లో ఎందుకు నర్తిస్తున్నావ్? నువ్వు మాకింక అవసరం లేదంటూ... రష్మికని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగులో రొమాంటిక్ పాటలు రావడం లేదన్నది రష్మిక ఉద్దేశం కావొచ్చు. కాకపోతే.. తెలుగులో అన్నీ మసాలా పాటలే వస్తున్నాయని చెప్పడం మాత్రం భావ్యం కాదు.