రష్మిక మందన్నా.. మృణాల్ ఠాకూర్ ఈ ఇద్దరిలో మీకు బాగా తెలిసిన హీరోయిన్ ఎవరు? అని అడిగితే... ఏం చెబుతారు? టక్కున రష్మిక పేరే బయటకు వస్తుంది. వెంటనే `మృణాల్ ఠాకూర్` ఎవర్నన ప్రశ్న ఎదురవుతుంది. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా తెలియని పేరు.. మృణాల్. ఇప్పుడు `సీతారామం`తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఇదే సినిమాలో రష్మిక కూడా నటిస్తోంది. కానీ... ఈ సినిమా వరకూ... చిత్రబృందం మృణాల్ ఠాకూర్‌కే అగ్రతాంబూలం ఇస్తోంది. రష్మికని సినిమా భాషలో చెప్పాలంటే `సెకండ్ హీరోయిన్` స్థానానికి నెట్టేసింది.. ఇది నిజంగానే షాకిచ్చే విషయం.
రష్మిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? టాలీవుడ్ లోనే తను అగ్ర కథానాయికగా చలామణీ అవుతోంది. ఒక్కో సినిమాకి తన పారితోషికం ఇంచుమించుగా రూ.3 కోట్లు. అయినా సరే, కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది.. `సీతారామం`లో తాను హీరోయిన్ కాని హీరోయిన్ పాత్ర పోషించడం - అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న విషయం. `మా సినిమాలో రష్మిక ఉందహో..` అంటూ దర్శక నిర్మాతలు ప్రచారం చేసుకొనే ట్రెండ్ లో.. అంతటి స్టార్ ని పక్కన పెట్టి.. కొత్త హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌పై `సీతారామం` బృందం ఫోకస్ పెట్టింది. ఆమెనే గట్టిగా ప్రమోట్ చేయాలనుకొంటోంది. ఇది నిజంగా మార్కెట్ లో కొత్త స్ట్రాటజీనే.
సీతారామం... యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే స్లోగన్ తోనే.. ఒక్కసారిగా ఈ సినిమాపై ఫోకస్ పెంచేలా చేశారు దర్శక నిర్మాతలు. ప్రేమకథలో ఎప్పుడైనా హీరో - హీరోయిన్ల కెమిస్ట్రీనే కీలకం. జనాల్ని థియేటర్లకు రప్పించే తారక మంత్రం అదే. అందుకే `సీతారామం`హీరోయిన్ విషయంలో చిత్ర బృందం దేశమంతా జల్లెడ పట్టింది. ఈ విషయంలో హను రాఘవపూడి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్నో ఆడిషన్లు చేసి చివరికి మృణాల్ ని ఎంచుకొన్నారు. మృణాల్ కి నటన కొత్తేం కాదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే.. అవేం సూపర్ డూపర్ కమర్షియల్ హిట్లు కావు. కానీ... నటిగా మృణాల్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. పైగా ఆమె ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ ఇట్టే పలికేస్తాయి. అందుకే... దుల్కర్‌ని తనే సరైన జోడీ.. అని చిత్రబృందం ఫిక్సయ్యింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాల్లో... మృణాల్ లుక్స్ తో ఆకట్టుకొంటోంది. సీతగా... మృణాల్ కి మించిన ఆప్షన్ దొరకదేమో... అన్నంతగా ఆకట్టుకుంటోంది. `ఇంతందం...` పాటలో సల్మాన్, మృణాల్ కెమిస్ట్రీ కూడా చూడ ముచ్చటగా కుదిరింది. తన విషయంలో దర్శక నిర్మాతల ఎంపిక... తప్పుకాదని మృణాల్ నిరూపించుకొంది.
ఇక రష్మిక విషయానికొస్తే... ఇందులో `అఫ్రీన్` అనే పాత్రలో కనిపించబోతోంది. ఆమెకు సంబంధించిన ప్రచార చిత్రాలు చూస్తే... తనదెంత సీరియస్ క్యారెక్టరో అర్థమవుతోంది. ఎప్పుడూ పాటలు పాడుకుంటూ, హీరో వెంట పడే... రెగ్యులర్ పాత్రలు చేసే హీరోయిన్లు.. అప్పుడప్పుడూ ఛేంజ్ ఓవర్ క్యారెక్టర్లు కోరుకుంటారు. అందులో భాగంగానే.. రష్మిక ఈ ఆఫర్‌ని ఒప్పుకొంది. అయితే.. రష్మిక పాత్రని అండర్ ప్లే చేస్తూ.. ఒక్కసారిగా థియేటర్లలో బ్లాస్ట్ చేయాలన్నది.. దర్శకుడి ఉద్దేశం అనిపిస్తోంది. అందుకే రష్మిక కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించింది. హీరోయిన్ గా ఊపిరి సలపని బిజీలో ఉన్న రష్మికకు ఈ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే.. తన పాత్రలో కనిపించిన ఛాలెంజ్‌నీ, వైజయంతీ మూవీస్ అనే బ్యానర్‌నీ దృష్టిలో ఉంచుకొని... రష్మిక `సీతారామం` టీమ్‌లో తాను కూడా భాగం పంచుకొని ఉండొచ్చు. మరి వైజయంతీ మూవీస్ వేసిన ఈ ఎత్తుగడ పారిందా, లేదా? రష్మికని మృణాల్ ఠాకూర్ డామినేట్ చేసిందా? లేదంటే.. మృణాల్ ని రష్మిక క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే... సీతారామం వచ్చేంత వరకూ ఆగాల్సిందే.