పారితోషికం విషయంలో రవితేజ చాలా పట్టుగా ఉంటాడన్న విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. రవితేజకు ఓ కోటి రూపాయల పారితోషికం ఎక్కువ ఇస్తే సరిపోతుందని, కథ కాస్త అటూ ఇటుగా ఉన్నా పట్టించుకోడని ఓ టాక్ నడుస్తుంటుంది. అంతే కాదు. సినిమా పూర్తయి, విడుదల అవుతున్న తరుణంలో, తన పారితోషికం అమాంతం పెంచేస్తాడని, అది ఇస్తే గానీ, డబ్బింగ్ చెప్పనని లింకు పెడతాడని, దాంతో చచ్చినట్టు నిర్మాత అడిగినంత పారితోషికం ఇవ్వాల్సివస్తుందని టాలీవుడ్ లో ఓ రూమరు. అలాంటి రవితేజ ఓ సినిమా ఫ్లాప్ అవ్వగానే, తన పారితోషికంలో కొంత వెనక్కి ఇచ్చేయడం వింతగానూ, విచిత్రంగానూ తోచడం సహజమే.
రవితేజకు ఈమధ్య వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈమధ్య విడుదలైన `రామారావు ఆన్ డ్యూటీ` కూడా ఫ్లాపైపోయింది. ఈ సినిమాతో నిర్మాత దారుణంగా దెబ్బతిన్నాడు. అందుకే రవితేజ తన పారితోషికంలోంచి కొంత భాగం వెనక్కి ఇచ్చాడని టాక్.ఇప్పటి వరకూ ఏ సినిమాకీ రవితేజ ఇలా డబ్బు తిరిగి ఇవ్వలేదని, ఇదే తొలిసారని చెబుతున్నారు. దానికీ ఓ కారణం ఉంది. ఈ సినిమాకి రవితేజ కూడా ఒకానొక నిర్మాతే. తన పారితోషికమే పెట్టుబడిగా పెట్టాడు. అయితే విడుదలకు ముందే తన వాటా తీసుకొన్నాడు. ఇప్పుడు నష్టాలొచ్చాయి. దాంతో ఓనిర్మాతగా తన బాధ్యత గుర్తెరిగి, మరో నిర్మాతకు నష్టపరిహారంగా తాను తీసుకొన్న మొత్తంలోంచి కొంత తిరిగి ఇచ్చేశాడు. ఏదేమైనా రవితేజలో ఇది ఊహించని మార్పు. మిగిలిన హీరోలంతా తమ బాధ్యతల్ని ఇలానే గుర్తెరిగి ప్రవర్తిస్తే నిర్మాతలకు కాస్త భరోసా దొరికినట్టవుతుంది.