నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్.
దర్శకత్వం : మల్లిడి వశిష్ట్
నిర్మాత: హరికృష్ణ కె
సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
ఎడిటర్: తమ్మి రాజు
రేటింగ్: 3/5
జయాపజయాలకు సంబంధం లేకుండా సినిమా అంటే ఒక ప్యాషన్ తో చేస్తున్నారు కళ్యాణ్ రామ్. వరుస అపజయాలు వస్తున్న క్రమంలో భయపడకుండా ఓత్రీడి సినిమాని భారీగా తీసి సినిమాపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆయన నుండి మరో భారీ సినిమా వచ్చింది. అదే బింబిసార. ఫాంటసీ జోనర్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ టీజర్ ఆసక్తిని పెంచాయి. ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. తెలుగు లో ఫాంటసీ జోనర్ ఎవర్ గ్రీన్. అందుకే బింబిసార పై అందరి ద్రుష్టి పడింది. పాజిటివ్ వైబ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార కథలో వెళితే..
కథ :
త్రిగర్తల రాజ్యానికి రాజు బింబిసారుడు (కల్యాణ్ రామ్). రాజు అంటే మామూలు రాజు కాదు.. తనకి ఎదురొచ్చిన సొంత ప్రజలని కూడా ముక్కలుముక్కలుగా నరికేసే క్రూరుడు. ధికారం కోసం తన కవల సోదరుడు దేవదత్తుడు (కళ్యాణ్ రామ్ )ని దేశం నుండి వెళ్ళగొడతాడు. అయితే ఒక సందర్భంలో దేవదత్తుడు ఓ మాయదర్పణం సాయంతో బింబిసారుడిని ప్రజంట్ టైమ్స్ కి పంపించేస్తాడు. మరి ప్రజంట్ టైం లోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విధి అతనికి ఎలాంటి పాఠాలు నేర్పింది? బింబి దాచిన నిధి తలుపులు తెరవడం కోసం సుబ్రహ్మణ్యశాస్త్రి (వివాన్ భటేనా) ఎందుకు ప్రయత్నిస్తుంటాడు? చివరికి బింబి గతంలోకి వెళ్ళాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కాలం చుట్టూ తిరిగే కథలు తెలుగులో కొత్త కాదు. ఆదిత్య 369 టైం ట్రావెల్ కథే. ఇప్పుడు వచ్చిన బింబిసారలో కూడా టైం ట్రావెల్ వుంది. అయితే ఇది త్రిగర్తల రాజ్యానికి ప్రస్తుతానికి మాత్రమే పరిమితం చేసిన కథని నడిపారు. టైం విషయంలో ఎలాంటి తికమక లేకుండా కథని నేరుగా ఓపెన్ చేసిన విధానం నచ్చుతుంది. ఇందులో ముఖ్యంగా మూడు ఎలిమెంట్స్ వున్నాయి. మాయ దర్పణం గురించి ముందే క్లారిటీ ఒక సీన్ రాసుకున్నారు. తర్వాత నిధి వేట గురించి మరో సన్నివేశం. ఈ రెండు సీన్స్ లీడ్ తీసుకొని బింబి కథని ఎలాంటి కన్ఫ్యుజన్ లేకుండా నడిపిన విధానం మెచ్చుకోతగ్గదే.
ఐతే ఫాంటసీకి ఇమాజినేషన్ ముఖ్యం. త్రిగర్తల నేపధ్యం వరకూ చక్కగా నడిపిన దర్శకుడు ఎప్పుడైతే బింబి వర్తమానంలోకి వస్తాడో అప్పటి నుండి దిన్ని చాలా సాధారణమైన కథగా డీల్ చేయడం మెప్పించదు. ఇంటర్వెల్ బాంగ్ తో కాస్త ఆసక్తిని పెంచి వెంటనే మళ్ళీ కామన్ సీన్స్ తో స్క్రీన్ ప్లే ని డల్ చేసిన విధానం అంతగా ఆకట్టుకోదు. వర్తమానంలోకి వచ్చాక బింబికి ఎదురయ్యే పరిస్థితులు యమలీలని గుర్తు తెస్తుంది. నిధి, గ్రంధం చుట్టూ మరింత ఆసక్తికరంగా డ్రామా నడిపే అవకాశం వున్నప్పటికీ దిన్ని సోషల్ సినిమాగానే డీల్ చేయడం ఆకట్టుకోదు. అయితే క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్, అమరపుష్పం ముగింపు ప్రేక్షకుడిని మెప్పిస్తాయి.
నటీనటులు:
బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమాలో బలంగా వున్న పాత్ర బింబి మాత్రమే. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కేథరిన్, సంయుక్తా పాత్రల్లో బలం లేదు. తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి పాత్రలు పరిధి మేర ఆకట్టుకుంటాయి. దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకొని
ఫాంటసీలో మ్యాజిక్ చేసి వుంటే బింబిసార మరో మెట్టు ఎక్కేది.
టెక్నికల్ :
విజువల్ ఎఫెక్ట్స్ లో బడ్జెట్ లిమిట్స్ కనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ సోసో గానే వుంది. ఛోటా.కె నాయుడు కెమరా రిచ్ గా వుంది. కీరవాణి నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్
కథా నేపధ్యం
కళ్యాణ్ రామ్
నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఫాంటసీ ఎలిమెంట్స్ తగ్గడం
పాటలు
ఫైనల్ వర్దిక్ట్ : బింబిసారుడు.. బోర్ మాత్రం కొట్టడు