రవితేజ హీరోగా ‘క్రాక్’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, మరోమారు రవితేజతో జత కట్టబోతున్నాడట. ఈ విషయమై ‘క్రాక్’ సమయంలోనే రవితేజ - గోపీచంద్ మధ్య డీల్ సెట్ అయ్యిందని అంటున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రవితేజకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది.
రవితేజ - శృతిహాసన్ కాంబినేషన్‌లో రూపొందిన ‘క్రాక్’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ విజయంతో తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కరోనా నేపథ్యంలో అనేక ఆంక్షల నడుమ ఎట్టకేలకు సినిమా థియేటర్లు పునఃప్రారంభం కాగా తొలుత ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలయ్యింది.. ఆ తర్వాత ‘క్రాక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మాస్ పవర్ ఏంటన్నది కరోనా సీజన్‌లోనూ ‘క్రాక్’తో నిరూపితమయ్యింది. ఈ సినిమాకి వచ్చని పాజిటివ్ రివ్యూలు, సెలబ్రిటీల నుంచి ప్రశంసల నేపథ్యంలో వీలైనంత త్వరగా తమ కాంబోని రిపీట్ చేయాలన్నది రవితేజ సంకల్పంగా వుంది. అతి త్వరలోనే రవితేజ - గోపీచంద్ కాంబినేషన్‌లో మలి చిత్రానికి సంబంధించిన ప్రకటన రాబోతోందట. అది కూడా ‘క్రాక్’ తరహాలోనే మాస్ ఎంటర్‌టైనర్ కాబోతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.