ఏ సినిమాకైనా ప్లానింగ్ చాలా అవసరం. ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది? ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే లెక్కలు పక్కాగా తెలియాలి. ఓ బడ్జెట్ అనుకుంటే అందులోనే సినిమాని పూర్తి చేయడం చాలా పెద్ద టాస్క్. ప్రతీ నిర్మాత తను అనుకున్న బడ్జెట్ లో సినిమాని పూర్తి చేయాలనుకుంటాడు. కానీ అది ఎల్లవేళలా సాధ్యం కాదు. బడ్జెట్ పెరిగిపోవడం వల్లే సినిమాలు మునిగిపోయిన సందర్భాలెన్నో. ఇప్పుడు `ఖిలాడీ` కూడా ఈ ప్రమాదంలో పడింది.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకుడు. క్రాక్ తరవాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయిందట. అనుకున్న బడ్జెట్ కీ, ఇప్పటి లెక్కలకూ అస్సలు పొంతన లేకుండా పోయిందని టాక్. ఈ సినిమాషూటింగ్ మరో పది రోజులు బాకీ ఉందని, బడ్జెట్ లేక షూటింగ్ ఆగిపోయిందని, ఫైనాన్షియర్లు ముందుకొస్తే తప్ప ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలవ్వదని తెలుస్తోంది. ఖిలాడీ ఫారెన్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా ఆ షెడ్యూల్ ని అర్థాంతరంగా ముగించుకుని రావాల్సివచ్చింది. కరోనా వల్ల మిగిలిన సినిమాలు కూడా నష్టపోయాయి. కానీ ఖిలాడీ కాస్త ఎక్కువ నష్టపోయిందని, అందుకే ఇంత ఇబ్బందని ఇన్ సైడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.