ప్రతిరోజూ పండగే లాంటి సూపర్ హిట్ తరవాత కూడా మారుతి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. కథ రెడీ చేసుకున్నా, హీరోలు అందుబాటులో లేకపోవడం కొంత, పరిస్థితులు కలసి రాక కొంత, కరోనా విజృంభణ కొంత.. ఇలా... అన్నీ తలా కొంత కారణమయ్యాయి. దాంతో... మారుతి సినిమా లేటయ్యింది. రవితేజతో మారుతి సినిమా చేస్తాడని ప్రచారం మొదలైనా, ఆ హీరో డేట్లు ఇస్తాడా, లేదా? అనే అనుమానం నెలకొంది. ఎందుకంటే రవితేజ చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. వాటి మధ్య... మారుతి సినిమా పట్టాలెక్కుతుందా, లేదా? అనే అనుమానాలు నెలకున్నాయి. అయితే ఎట్టకేలకు మారుతి రవితేజ సినిమా ఓకే అయ్యింది.
ఈనెలలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరి లో రెగ్యులర్ షూట్ మొదలు కానుందట. ప్రస్తుతం రవితేజ `క్రాక్` సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు `ఖిలాడీ` పనులు జరుగుతున్నాయి. `క్రాక్` అవ్వగానే మారుతి సినిమా మొదలవుతుంది. ఓ వైపు ఖిలాడీ చేస్తూనే.. మారుతి సినిమానీ పూర్తి చేయాలని రవితేజ భావిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.