కరోనా భయాలు ఓ పక్క వున్నాసరే, ఈ సంక్రాంతి బరిలో పలు సినిమాలు పోటీ పడుతున్నాయి.. పైగా, అవి చిన్న సినిమాలేమీ కావు. భారీ అంచనాలున్నవే. రామ్ హీరోగా నటించిన ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ అలాగే మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలు ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా ఈ సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, థియేటర్లలో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకే ప్రస్తుతం అనుమతి వుంది.
ఈ పరిస్థితుల్లో ఎక్కువ సినిమాలు ఒకేసారి విడుదలవడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ జరుగుతోంది. అయితే, సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని అంటున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. పోటీ ఖచ్చితంగా వుండాల్సిందేననీ, అప్పడే ఇటు సినీ పరిశ్రమకీ అటు ప్రేక్షకులకీ కిక్ వుంటుందని రవితేజ చెప్పుకొచ్చాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ‘రెడ్’లో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమ్రుత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అల్లుడు అదుర్స్’ సినిమా విషయానికొస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అను ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.