రవితేజ అంటేనే మాస్! మాస్ అంటే రవితేజ. అందుకే ఆయన మాస్ మహారాజా అయ్యారు. అలాంటి ఓ హీరోని అంధుడిగా చూపించాలనుకోవడం నిజంగా సాహసమే. అయితే ఆ సాహసానికి కమర్షియల్ కోటింగు ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `రాజా ది గ్రేట్`. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నాడు. టీజర్ ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా విడులైంది. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు’ అన్న డైలాగ్‌కి రవితేజ దీటుగా.. ‘నోర్ముయ్.. ఆ నయనాలు లేకుండానే పాతికేళ్ల నుంచి కుమ్మేస్తున్నానిక్కడ. మిగతా పార్టులు అమ్మేసుకుంటారా? సర్వేంద్రియానాం సర్వం ప్రధానం’ అని చెబుతున్న డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం ఈ డైలాగ్ చుట్టూనే తిరగబోతోంది. టీజర్ మొత్తం స్టైలీష్‌గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని పొందుపరిచారు. మొత్తంగా రవితేజ ఖాతాలో మరో మాస్ హిట్ చేరబోతున్నట్టే అనిపిస్తోంది.