ఇండియన్2 (భారతీయుడు2) సినిమా షూటింగ్‌లో పెను విషాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఓ భారీ క్రేన్ అమాంతం కుప్ప కూలిపోవడంతో ముగ్గురు యూనిట్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సినిమాలో నటిస్తోన్న కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరోపక్క బాధిత కుటుంబాలకి కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు కమల్ హాసన్. అయితే, తెరవెనుక కథ వేరే వుందనే చర్చ జరుగుతోందిప్పుడు. 60 అడుగుల క్రేన్ కోసం పర్మిషన్ తీసుకుని, 100 అడుగుల భారీ క్రేన్‌ని వినియోగించడం వల్లే ప్రమాదం జరిగిందట. ఈ విషయాన్ని క్రేన్ ఆపరేటర్, పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేసు విచారణను సీబీఐకి కూడా అప్పగించినట్లు సమాచారం. మొత్తంగా 22 మందిని ఈ కేసులో విచారించబోతున్నారట. వారిలో కమల్ హాసన్‌తోపాటు కాజల్ అగర్వాల్ కూడా వుంటారట. దర్శకుడు శంకర్‌కి సినిమాల్ని భారీ స్థాయిలో తెరకెక్కించడం అలవాటు. అవసరానికి మించి హంగుల్ని తన సినిమాలకు అద్దుతుంటాడు శంకర్. ఈ క్రమంలో భద్రతని ఆయన ఏమాత్రం పట్టించుకోడన్న విమర్శలు ఓ పక్క విన్పిస్తున్నాయి. అయితే, శంకర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడనీ, తొలుత భద్రతకు ప్రాధాన్యతనిస్తాడనీ, అందుకే సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంటుందని ఆయన సన్నిహితులు ఇంకో వాదనను విన్పిస్తున్నారు. ఎవరు తప్పిదానికి పాల్పడ్డారు.? అనే విషయాన్ని పక్కన పెడితే, మూడు నిండు ప్రాణాలు పోవడం అత్యంత బాధాకరమైన విషయం. సినిమాలే తమ జీవితం అనుకుని సినీ రంగంలోకి వచ్చిన ముగ్గురు ఔత్సాహికులు, ఆ సినిమాకి బలైపోవడం ఎవరూ జీర్ణించుకోలేరు.