కొద్దిరోజుల క్రితం నుంచీ గీత రచయిత కులశేఖర్ పేరు మీడియాలో బాగా వినిపిస్తోంది. దొంగతనం కేసులో ఆయన పట్టుబడడమే అందుకు కారణం. దాదాపు 50 పాటలు రాసిన కులశేఖర్‌కి ఏమైంది?? అని అందరూ ఆశ్చర్యపోయారు.
ఇది వరకు ఆయన ఓ గుళ్లో శఠగోపం దొంగిలించి.. పోలీసులకు చిక్కారు. ఆనేరం మీదనే ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇప్పుడు తాజాగా ఓ గుళ్లో పూజారుల సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు దొంగిలించి పట్టుపడ్డారు. కులశేఖర్‌కి మతిస్థిమితం తప్పిందని, అందుకే అలా చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కానీ కులశేఖర్ వాదన మరోలా ఉంది. ఆయనకు పూజారులంటే గిట్టదట. అందుకే అలా వాళ్ల వస్తువుల్ని దొంగిలిస్తున్నానని చెబుతున్నారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంగో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. కులశేఖర్ ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. గీత రచయితగా ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయన ఓ పాట రాశారు. అది హిందూవులు, మరీ ముఖ్యంగా పూజారుల మనోహావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని మత పెద్దలు భావించి.. బ్రాహ్మణ సంఘాలు ఆయన్ని వెలివేశాయి. ఆ తరవాత కుటుంబంలో మనస్థర్థలు రావడంతో ఆయనపై అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో... కులశేఖర్ బాగా మనస్తాపం చెందారట. ఆ కోపంతోనే పూజారుల వస్తువుల్ని దొంగిలించడం మొదలెట్టార్ట. ఇదీ కులశేఖర్ చెప్పిన వివరణ.
ఆయన సన్నిహితులు మాత్రం 'కులశేఖర్‌కి మతిస్థిమితం పూర్తిగా తప్పింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు. ఆయనకు ఇప్పుడు చికిత్స అవసరం' అంటున్నారు. పాపం... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కులశేఖర్ ఇలా అయిపోవడం మాత్రం అందరినీ తీవ్రంగా బాధిస్తోంది.