తొలి షో నుంచే `మహర్షి` మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో నడుస్తోంది. సినిమా అంచనాలకు తగ్గట్టుగానే లేదని అభిమానులే పెదవి విరుస్తున్నారు. అందరూ ముకుమ్మడిగా చెబుతున్న మాట ఒక్కటే. ఈ సినిమా నిడివి చాలా ఎక్కువ ఉందని. దాదాపు మూడు గంటల సినిమా ఇది. ఈరోజుల్లో అన్ని గంటలు సినిమా చూసే ఓపిక ఎవ్వరికీ లేదు. రెండు గంటల్లో సినిమా ముగించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పుడు మూడు గంటల సినిమా తీయడం నిజంగా సాహసమే.
సినిమాలో ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయని.. చూస్తున్నప్పుడే అర్థమవుతోంది. నిజానికి ఈ సినిమాని ఓ అరగంట కుదిస్తే మంచిదని మహేష్ ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడట. కానీ.. దిల్‌రాజు, వంశీ పైడిపల్లి మాత్రం మహేష్ మాటల్ని వినిపించుకోలేదు. `కంటెంట్ ఉన్న సినిమా ఇది.. కాస్త స్లోగా ఉన్నా.. జనం చూస్తారు` అంటూ మహేష్‌ని మభ్య పెడుతూనే ఉన్నారట. ఓవర్సీస్‌కి ఫైనల్ కాపీ పంపించే ముందు కూడా మహేష్ ఇదే మాట దర్శక నిర్మాతలకు చెప్పాడని, అప్పుడూ వాళ్లు పట్టించుకోలేదని తెలిసింది.
చివరికి మహేష్ ఫైనల్ కాపీ చూడకుండానే.. ఓవర్సీస్‌కి డెలివరీ అయిపోయిందని సమాచారం. గురువారం వచ్చిన స్పందన చూసిన చిత్రబృందం వెంటనే తేరుకుంది. ఇప్పుడు సినిమాని ఎక్కడ కుదించాలా అంటూ ఎడిటింగ్ రూమ్‌లో తర్జన భర్జనలు పడుతోందని తెలుస్తోంది. మహేష్ చెప్పినప్పుడే జాగ్రత్త పడితే - ఇంత నెగిటీవ్ టాక్ వచ్చేదే కాదు.