చిరంజీవి - పవన్ కల్యాణ్‌లు కలుసుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నాదమ్ములు కలుసుకున్న ఓ ఫొటోకి అంత క్రేజ్ రావడం చూస్తుంటే - ఆ ఫొటో వెనుక ఏదో అంతరార్థం ఉందన్న సంగతి పరోక్షంగానే తెలుస్తోంది. చిరు, పవన్‌లు అన్నాదమ్ములే అయినా, కలుసుకునేదే పండగకో, పుష్కరానికో అన్నట్టుంటుంది. అయితే ఇప్పుడు సమయం సందర్భం లేకపోయినా ఈ బ్రదర్స్‌కలుసుకోవడం, ఓ సెల్ఫీని సోషల్ మీడియాకు వదలడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ భేటీ వెనుక రాజకీయ కోణమూ ఉందన్నది టాలీవుడ్ టాక్. ఇటీవల జనసేన అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండు నియోజక వర్గాలలోనూ ఓడిపోయాడు. తన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయ్యింది. పవన్ పార్టీని పునః నిర్మించే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే చిరు సలహాలు, సహాయం తీసుకోవడానికి వెళ్లాడని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందే చిరు పవన్ పార్టీతో చేతులు కలుపుతారని, చిరుకి ఓ కీలక పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది.
అయితే.. చిరు ఎందుకో ఆసక్తి చూపించలేదు. వచ్చే ఎన్నికలలో పు పార్టీని బలోపేతం చేయడానికి పవన్ సన్నాహాలలో ఉన్నాడు. అందులో భాగంగానే అన్నయ్యతో భేటీ వేశారని తెలుస్తోంది. అందుకే జనసేనలో కీలక సభ్యుడైన నాదెండ్ల మనోహర్‌తో కలసి మరీ ఈ మీటింగ్ పెట్టాడని టాక్. మరి ఇదంతా నిజమా, కాదా? ఈ భేటీ వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటి? అనేవిషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలి.