2018లో హిట్లు, సూపర్ హిట్లు చాలా చూసింది చిత్రసీమ. మహానటి, రంగస్థలం, గీత గోవిందం, ఆర్.ఎక్స్ 100 లాంటి విభిన్నమైన చిత్రాల్ని అందించింది 2018. అయితే.. `ఉత్తమ చిత్రం` క్యాటగిరీ ఒక్క సినిమాకే దక్కాలి. ఆ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న సినిమా `రంగస్థలం`. అటు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించుకుని, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. అందుకే `రంగస్థలం` ఈ గౌరవం దక్కించుకుంది.
సుకుమార్ కమర్షియల్ దర్శకుడే. కానీ.. తన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. అవే హీరోల్నీ, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. లాజిక్కులు, లెక్కలతో కట్టిపడేస్తాడు సుక్కు. అయితే.. ఆ ట్రెండ్‌కి దూరంగా వచ్చి `రంగస్థలం` కథ రాసుకున్నాడు. నిజానికి ఇదో... రివైంజ్ డ్రామా. తెలుగునాట అరిగిపోయిన ఫార్ములా. అయితే.. ఆ ఛాయలేం కనిపించకుండా మ్యాజిక్ చేశాడు.
కథానాయకుడ్ని ధీరోధాత్తుడిగా చూపించడం మన సినిమాల స్టైల్. రామ్‌చరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్నవాళ్లనైతే ఆకాశమే హద్దుగా తెరపైకి తీసుకురావాలి. అయితే హీరో చెవిటివాడు అనే కాన్సెప్ట్ ని ఎంచుకోవడం, దాని చుట్టూ కథని అల్లడం సుక్కు గట్స్‌కి నిదర్శనం.
1980 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటి వాతావరణాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఆ విషయంలోనూ చిత్రబృందం సక్సెస్ అయ్యింది. పిరియాడికల్ సినిమాల్ని ఎలా చూపించాలో చెప్పడానికి ఈ సినిమా ఓ నిదర్శనంగా మారింది. ఆర్ట్‌తో పాటు సంగీతం, కెమెరా పనితనం బాగా కలిసొచ్చాయి.
పాత్రల చిత్రణ ఈ సినిమాకే వన్నె తెచ్చింది. చరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ... ఇలా ఏ పాత్ర తీసుకున్నా.. ప్రతీ పాత్రకీ ఓ ఔచిత్యం ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్టు.. ఈ సినిమాకే హైలెట్ గా మారింది.
రామ్‌చరణ్ ఇది వరకు చాలా సినిమాలు చేశాడు. హిట్లు కొట్టాడు. అయితే తనలోని అసలు సిసలైన నటుడ్ని బయటపెట్టిన సినిమా ఇదే అని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. సుకుమార్‌కీ హిట్లు కొత్తకావు. కానీ తన దైన లాజిక్కుల ఫార్ములా వదిలి ఓ కొత్త కథని చెప్పాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఇవన్నీ కలిపే.. రంగస్థలంని ఈ యేడాది మేటి చిత్రంగా నిలిపేలా చేశాయి.
రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)