సినిమా అనేది కళే కావొచ్చు. కానీ.. నిలువెల్లా వ్యాపార సూత్రాల్ని ఒంటబట్టించుకున్న కళ. పెట్టుబడి ఎంత - రాబడి ఎంత? అనే విషయాలపైనే ఆ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. సినిమా బాగుంది అనే మాట కంటే.. ఈ సినిమాకి లాభాలొచ్చాయి, సూపర్ హిట్ అయ్యింది.. అనే మాటలే టాలీవుడ్ ని సంతృప్తి పరుస్తుంటాయి. ఓ సినిమా బాగా ఆడి, డబ్బులొస్తే.... ఆ స్ఫూర్తితో మరిన్ని సినిమాలు తయారవుతుంటాయి. అలా... సినిమానే నమ్ముకున్నవాళ్లందరికీ నీడ దొరుకుతుంది. ఎప్పుడైతే... కొత్త సినిమాలు రావడం మొదలైందో, అప్పుడు పరిశ్రమ కళకళలాడుతుంటుంది.
చిత్ర సీమ బాగుండాలంటే.. హిట్లు ఎక్కువ పడాలి. ఎన్ని సూపర్ హిట్లొస్తే.. అంత మంచిది. అయితే చిత్రసీమలో హిట్స్ శాతం ఎప్పుడూ 10 శాతానికి మించదు. వంద సినిమాలొస్తే అందులో పది సినిమాలకు మాత్రమే హిట్ ప్రాప్తం దక్కుతుంది. 2018 ముగింపుకి వచ్చేశాం. మరి అలా.. సూపర్ హిట్ అనిపించుకున్న ఆ సినిమాలేంటి? 2018 టాప్ 10 లిస్టు తీస్తే.. ఏ సినిమాలు గుర్తొస్తాయి? ఓ సారి చెక్ చేస్తే..?
ఈ యేడాది సూపర్ డూపర్ హిట్లలో రంగస్థలం, గీత గోవిందం, భరత్ అనే నేను, అరవింద సమేత చేరిపోయాయి. ఇవి నాలుగూ వంద కోట్ల మైలు రాయిని అందుకున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలైతే చరణ్, మహేష్ కెరీర్‌లోనే నెంబర్ వన్‌గా నిలిచాయి. గీత గోవిందం వంద కోట్లు అందుకుని చిత్రసీమని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈసినిమాతో విజయ్ దేవరకొండ రూపంలో ఓ స్టార్ టాలీవుడ్‌కి దక్కినట్టైంది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత' కూడా వంద కోట్ల మైలు రాయిని అందుకుంది. ఫ్యాక్షన్ సినిమాలకు రోజులు చెల్లిపోయాయి అని చెప్పుకుంటున్న తరుణంలో ఈ సినిమా విజయం సాధించడం ట్రేడ్ వర్గాల్ని, విమర్శకుల్నీ ఆశ్యర్యపరియింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా తగ్గిపోతున్న తరుణంలో.. అనుష్క 'భాగమతి' బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 2018 ప్రారంభంలోనే దక్కిన ఈ విజయం బాక్సాఫీసుని బూస్టప్ అందించింది. 'మహానటి' అటు విమర్శకుల ప్రశంసల్ని, ఇటు వసూళ్లకీ కలసికట్టుగా అందుకొంది. బయోపిక్ ఎలా తీయాలి? అని చెప్పడానికి ఈ సినిమా ఓ పాఠంగా ఉపయోగపడింది. చిన్న సినిమాల్లో కొన్ని బాగా మెరిశాయి. నాగౌశర్య 'ఛలో' ఊహించని రీతిలో వసూళ్లని అందుకొంది.
వరుణ్‌తేజ్‌కి 'తొలి ప్రేమ' రూపంలో ఓ మంచి విజయం దక్కింది. బాండ్ సినిమాగా వచ్చిన 'గూఢచారి' అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్న సినిమాని స్టైలీష్‌గా ప్రజెంట్ చేయడంలో దర్శక నిర్మాతలు విజయం సాధించారు. జేమ్స్ బాండ్ సినిమా వచ్చి చాలాకాలం అయిన నేపథ్యంలో ఆ లోటుని 'గూఢచారి' తీర్చగలిగింది. ఇక `ఆర్.ఎక్స్ 100` అయితే... చిన్న సినిమాల్లో పెను సంచలనంగా నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముంద ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. కానీ... వాటిని తలదన్నే వసూళ్లు అందుకుంది. పాటలూ సూపర్ హిట్టయ్యాయి.
ఈ యేడాది మరికొన్ని విజయాలూ చిత్రసీమ చవిచూసింది. అయితే ఈ పది సినిమాలదే అగ్రతాంబూలం అనిచెప్పొచ్చు.
రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)