రీక్యాప్‌ 2019: టాలీవుడ్ టాప్ 10 ఫ్లాఫ్స్.

మరిన్ని వార్తలు

సినిమా పరిశ్రమలో హిట్ రేటు పడిపోయింది. ఇప్పుడనే కాదు.. సక్సెస్ రేటు తక్కువే ఇక్కడ. వంద సినిమాలు వస్తే అందులో పది కూడ పాసవ్వన్ని పరిస్థితి. ఈ ఏడాది కూడా ఫ్లాపులు వున్నాయి. మంచి అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఒక్కసారి ఆ లిస్టు రివైండ్ చేసి చూస్తే...

 

క‌థానాయ‌కుడు:
'మహానటి' టాలీవుడ్ లో క్లాసిక్ గా నిలించింది. వెండితెరపై సావిత్రమ్మ జీవితం ప్రాణం పోసుకుంది. అలాగే ఎన్టీఆర్ జీవితం కూడా ప్రాణం పోసుకుంటుదని భావించారు అభిమానులు. క్రిష్ దర్శకుడు కావడంతో ఈ అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే ఎన్టీఆర్ జీవితం తెరపై మెప్పించలేకపోయింది. ఏకపక్షంగా సాగిన బాలయ్య 'క‌థానాయ‌కుడు' డై హార్ట్ ఫాన్స్ ని సైతం నిరాశ పరిచింది.  

 

మ‌హానాయ‌కుడు:
'క‌థానాయ‌కుడు' కధని మధ్యలో ఆపారు. తర్వాత 'మ‌హానాయ‌కుడు' అన్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితమైన  ఆసక్తికరంగా వుంటుదని భావించారు. కానీ ఇది క‌థానాయ‌కుడు కంటే విసుగు తెప్పించింది. సినిమాలో కాంఫ్లిక్ట్ వుండాలి. ఎప్పుడూ ఏకపక్షం హీరోయిజం వుండకూడదు. మహానాయకుడులో అదే లోపించింది. ఎన్టీఆర్ ని మహా మనిషి అని చూపించడానికే తప్పితే ఈ బయోపిక్  ప్రేక్షకులని అలరించలేకపోయింది.

 

విన‌య విధేయ రామా:
రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం ఓ క్లాసిక్. రామ్ చరణ్ ని ఒకేసారి పది మెట్లు ఎక్కించింది. అలాంటి సినిమా తర్వాత చరణ్ నుండి మరో గొప్ప సినిమా వస్తుందని ఆశ పెట్టుకున్న అభిమానుల మాడు పగలగొట్టాడు దర్శకుడు బోయపాటి. ఓ రొడ్ద కొట్టుడు కధ రాసుకొని, అంతకంటే రాడ్ లాంటి తీతతో అభిమానులు సైతం తలదించుకొనే సినిమాగా నిలిచింది విన‌య విధేయ రామా. ఇది ఎంత పెద్ద ఫ్లాఫ్ అంటే.. స్వయంగా రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణ కోరుతూ ఓ లేఖ రాశాడు. ''క్షమించండి. ఇక ఇలాంటి తప్పు జరగదు. నేను హామీ ఇస్తున్నాను'' అని ఓ ఓపెన్ లెటర్ రాశాడు చరణ్.  ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ బిజీ అయ్యాడు. 2020 లో చరణ్ నుండి ఈ భారీ వస్తుంది. 'విన‌య విధేయ రామా' చేదు జ్ఞాపకాన్ని ఆర్ఆర్ఆర్ తుడిచేస్తుందని భావిస్తున్నారు ఫాన్స్.      

 

డియ‌ర్ కామ్రేడ్‌
'గీతగోవిందం' తర్వాత మళ్ళీ విజయ్ రష్మిక జంట కట్టారు డియ‌ర్ కామ్రేడ్‌ కోసం. టీజర్, ట్రైలర్ అర్జున్ రెడ్డిని మురిపించాయి. పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. తీరా సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక కధకి ఎన్ని లేయర్లయిన ఉండొచ్చు. కానీ ఆ లేయర్లన్ని ఆ కధకి కనెక్ట్ అవ్వాలి. డియ‌ర్ కామ్రేడ్‌ కి ఇక్కడే దెబ్బ పడింది. ఎవరి కధ వారిదిగా విడిపోయింది. కాసేపు ప్రేమ, కాసేపు పోరాటం, ఇంకాసేపు క్యాస్టింగ్ కౌచ్.. ఇలా దేనికది విడిపోయిన డియర్ కామ్రేడ్ .. బాక్సాఫీసు వద్ద ఫ్లాఫ్ గా డిక్లేయర్ అయ్యింది.

 

మ‌న్మథుడు 2
నాగార్జున కెరీర్ లో 'మ‌న్మథుడు' మర్చిపోలేని సినిమా. ఆ సినిమా టైటిల్ ని వాడుకొని తీసిన 'మ‌న్మథుడు 2'.. టైటిల్ ని చెడగొట్టింది. కలర్ ఫుల్ గా తీసారే కానీ క్లూలెస్ సినిమాగా మిగిలిపోయింది. దర్శకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌ కి కొత్తదనం చుపిస్తాడని ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. అయితే అతడు మాత్రం.. స్టాక్‌ ఫార్ములాని నమ్ముకుని భంగపడ్డాడు. నాగార్జున ఇంత ఏజ్ లో కూడా ఫిట్ గా వున్నాడని అక్కినేని అభిమానులు సంబరపడటం తప్పితే ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి మరో విషయం లేకుండాపోయింది

 

గ్యాంగ్ లీడ‌ర్‌
ఈ ఏడాది రెండు సినిమాలు చేశాడు నాని. జెర్సీ ఓ క్లాసిక్. నటుడిగా నాని కెరీర్ లో అద్భుతమైన మైలు రాయి. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ ఫ్లాఫ్ అని చెప్పక తప్పదు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూ మనం, 24, ఇష్క్‌ లాంటి చిత్రాలు అందించిన విక్రమ్‌ కుమార్‌ నుండి వచ్చిన సినిమా ఇది. అయితే ఈ గ్యాంగ్ లీడర్ మాత్రం నిరాశ పరిచాడు. విక్రమ్ కుమార్ మెరుపులు ఇందులో కరువయ్యాయి. నాని మొత్తం సినిమాని భుజాలపై వేసుకున్నా సరే.. కధనంలో వైవిధ్యం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు గ్యాంగ్ లీడర్.  

 

చాణ‌క్య
గోపిచంద్ టైం అస్సల్ బాలేదు. ఎవరితో సినిమా చేసినా కలసి రావడం లేదు. దీంతో కెమరమాన్ తిరుని దర్శకుడిగా చేసి.. చాణక్య అంటూ ఓ స్పై థ్రిల్లర్ తో వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా గోపి జాతకాన్ని మార్చలేకపోయింది. మరో ఫ్లాఫ్ ఇవ్వడం తప్పితే ఇంకేం చేయలేకపోయింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌ లో వచ్చిన చాణక్య అటు యాక్షన్ లేక ఇటు థ్రిల్ చేయలేక చతికిలపడింది.

 

ఓట‌ర్‌
మంచు విష్ణు నల్లపూసైపోయాడు. ఆయన నుండి సినిమాలు తగ్గిపోయాయి. అయితే ఈ ఏడాది 'ఓటర్' తో వచ్చాడు. ఎలక్షన్ తర్వాత వచ్చిన ఈ ఓటర్.. గ‌ల్లంత‌య్యాడు. కధ, కధనంలో ఎలాంటి వైవిధ్యం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజులని డైలాగులుగా వాడేసి తీసిన ఈ ఓటర్.. లిస్టు లో లేకుండపోయాడు. దానికి తోడు సరైన ప్రమోషన్ కూడ లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిందో తెలియని పరిస్థతి.

 

రణరంగం

శర్వానంద్ కి ఈ ఏడాది కలసి రాలేదు. పడిపడి లేచే మనసు ఆకట్టుకోలేకపోయింది. తర్వాత గెటప్ మొత్తం మార్చి చేసిన రణరంగం కూడా ఆకట్టుకోలేకపోయింది. గాడ్‌ఫాదర్‌ ఇన్సిపిరేషన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు ముందు చతికిల పడింది. ఇంతవరకు హెవీ పాత్రల జోలికి పోని శర్వానంద్‌తో డాన్‌ వేషం , అదే సందర్భంలో పాతికేళ్ల యువకుడిగా కనిపించాడు. శర్వానంద్‌ వరకు తన పాత్రకి న్యాయం చేయగలిగాడు కానీ సుధీర్‌వర్మ మాత్రం డ్రామాని పడించలేకపోయాడు. విజువల్ పరంగా సినిమా ఓకే అనిపించుకుంది గానీ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో వైఫల్యం చెందింది.

 

90 ఎం.ఎల్‌
2019లో కార్తికేయ మూడో ఫ్లాఫ్ ఇచ్చిన సినిమా 90 ఎం.ఎల్‌. బేసిగ్గా సినిమాల్లో మందు కొట్టే సీన్లుని బాగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది. డైరెక్ట్ గా సినిమా మొత్తం మందు కొట్టడంపైనే నడిస్తే ఇంకా బావుందనే ఆలోచన దర్శకుడికి పుట్టినట్లు వుంది. అయితే ఆ ఆలోచన రాంగ్ అని తేల్చారు ప్రేక్షకులు. ఆర్‌ఎక్స్‌ 100 యూత్‌ని ఆకట్టుకోవడానికి హీరో విరహంలో మందుకి బానిసవ్వడం కూడా ఓ కారణం. దీంతో ఈ మందుబాబు కథ కూడా  కనక్ట్‌ అవుతుందని కార్తికేయ భావించాడు. అయితే ఈ సినిమాపై మందు బాబులు కూడా దయతలచలేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS