టాక్ ఆఫ్ ది వీక్‌: రూల‌ర్‌, ప్ర‌తిరోజూ పండ‌గే, దొంగ‌

మరిన్ని వార్తలు

సంక్రాంతికంటే ముందే టాలీవుడ్‌లో సంద‌డి మొద‌లైపోయింది. క్రిస్మ‌స్ కానుక‌గా ఒకేసారి మూడు పెద్ద సినిమాలు వ‌చ్చేశాయి. దాంతో ఈవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర హ‌డావుడి క‌నిపించింది. బాల‌య్య `రూల‌ర్‌`గా ముందుకొస్తే.. సాయిధ‌ర‌మ్ తేజ్ `ప్ర‌తిరోజూ పండ‌గే` అన్నాడు. ఇక కార్తి `దొంగ‌` అవ‌తారం ఎత్తాడు. మ‌రి వీటి రిజ‌ల్ట్ ఏమిటి? ఈ వారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మెరిసిప సినిమా ఏది..?

 

ఈ యేడాది బాల‌య్య‌కు అస్స‌లు క‌ల‌సి రాలేదు. త‌న నుంచి వ‌చ్చిన రెండు సినిమాలూ (క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు) ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. దాంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌న్న త‌ప‌న‌తో చేసిన సినిమా రూల‌ర్‌. ఈ క‌థ‌లో త‌న‌దైన మాస్‌, మ‌సాలా అంశాలు ఉండేలా చూసుకున్నాడు. కె.ఎస్ ర‌వికుమార్‌ని ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నాడు. వీరిద్దరి కాంబినేష‌న్లో వ‌చ్చిన జై సింహా బాగానే ఆడింది. దాంతో.. ఈ కాంబో మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుంద‌నుకున్నారు. కానీ.. ఆ పప్పులేం ఉడ‌క‌లేదు. తొలి రోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. పేల‌వ‌మైన క‌థ‌, నీర‌స‌మైన క‌థ‌నం, రొటీన్ రొడ్డ‌కొట్టుడు వ్య‌వ‌హారాల‌తో రూల‌ర్ బాగా విసిగించేశాడు. దాదాపు 40 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. త‌గిన ఓపెనింగ్స్ రాలేదు. తొలిరోజు 4 కోట్ల షేర్ ద‌క్కింది. శ‌ని, ఆదివారాలు అది స‌గానికి స‌గం త‌గ్గింది. దాంతో నిర్మాత‌కు, పంపిణీదారుల‌కు న‌ష్టాలు త‌ప్పేట్టు లేవు.

 

కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా వ‌చ్చిన సినిమా ప్ర‌తిరోజూ పండ‌గే. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించారు. చావుని కూడా పండ‌గ‌లా జ‌రుపుకోవాల‌ని, పెద్ద‌వాళ్ల ఆఖ‌రి ఘ‌డియ‌ల్లో వాళ్ల‌కు అండ‌గా ఉండ‌గాల‌ని చెప్పిన సినిమా ఇది. మారుతి శైలి వినోదానికి ఎమోష‌న్స్ తోడ‌య్యాయి. రావు ర‌మేష్ పాత్ర న‌వ్వుల్ని పంచింది. పాట‌లూ ఓకే అనిపించాయి. దాంతో... ఈ సినిమా పాసైపోయింది. రూల‌ర్‌తో పోలిస్తే త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. అయితే దాని కంటే ఎక్కువ వ‌సూళ్లే ద‌క్కించుకుంటోంది.

 

ఖైదీగా ఆక‌ట్టుకున్నాడు కార్తి. ఇప్పుడు దొంగ‌గా మారాడు. రీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. జ్యోతిక ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి మంచి ప్ర‌శంస‌లే ద‌క్కుతున్నాయి. రీతూ అందించిన స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకుంది. ఓ వెరైటీ క‌థ‌గా మిగిలింది. క్లైమాక్స్ ట్విస్టు గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే స‌రైన థియేట‌ర్లు ఈ సినిమాకి దొర‌క‌లేదు. అదే పెద్ద మైన‌స్‌గా మారింది. అయితే తెలుగులో ఈ సినిమా పెట్టుబ‌డికి త‌గిన రాబ‌డి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క్రిస్మ‌స్ సెల‌వ‌లు ఈ మూడు సినిమాల‌కూ క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS