థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలీక, చిత్రసీమ సతమతమవుతోంది. అందుకే.. మెల్లమెల్లగా ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్నారు నిర్మాతలు. మొన్నటి వరకూ థియేటర్లలోనే విడుదల చేస్తామని కూర్చున్న `వి` ఇప్పుడు గత్యంతరం లేక... ఓటీటీలో రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ బాటలోనే మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.
రామ్ నటించిన `రెడ్` కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుని, థియేటర్ల కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమాకి ఇప్పటికే ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. రామ్ పెదనాన్న, ఈ సినిమా నిర్మాత స్రవంతి రవికిషోర్.. ఓటీటీకి ఈ సినిమాని అమ్మేయాలని భావిస్తున్నా, రామ్ మాత్రం ససేమీరా అంటున్నాడట. పరిమితమైన బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమా ఇది. ఇప్పటికే శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో పెట్టుబడి వచ్చేసింది. ఓటీటీ ద్వారా వచ్చిందంతా లాభమే. కానీ.. రామ్ మాత్రం ఓటీటీకి అమ్మవద్దని చెబుతున్నాడట. రామ్ గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొట్టింది. థియేటర్ల నుంచి 50 కోట్ల వసూళ్లు అందుకుంది. అందుకే ఈ సినిమానీ థియేటర్లలోనే చూపించాలని అనుకుంటున్నాడట. రామ్ ని ఎలాగైనా సరే, ఒప్పించి ఈసినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని స్రవంతి రవికిషోర్ భావిస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.