శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రోబో' సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. '2.0'గా రానున్న ఈ సినిమాకి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శంకర్ సినిమా అంటేనే భారీతనం. ఆ భారీతనానికి తోడు అత్యద్భుతమైన గ్రాఫిక్స్ ఆ సినిమాలకు అనూహ్యమైన క్రేజ్‌ని తెచ్చిపెడుతుంటాయి.
'2.0' సినిమా ఇప్పటిదాకా ఇండియన్ సినిమా స్క్రీన్‌పై వచ్చిన చిత్రాలన్నిటికీ భిన్నం. అటు బడ్జెట్ పరంగా, ఇటు భారీతనం, సాంకేతిక విలువల పరంగా ఇది ఇండియన్ సినిమాకి ల్యాండ్ మార్క్ అనదగ్గ చిత్రమంటున్నారు సినీ పండితులు. అయితే మేకింగ్‌లో ఆలస్యానికి, మేకింగ్ తర్వాత ఆలస్యం తోడై, సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా ఇంకా ఆలస్యమవుతోంది. ఇటీవల మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం చూస్తే ఏప్రిల్‌లో '2.0' సినిమా విడుదల కావాలి. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదట, పూర్తి కావడానికీ ఇంకొంత సమయం పడుతుందట. సాక్షాత్తూ దర్శకుడు శంకర్ ఈ విషయాన్ని ప్రకటించేసరికి, సినిమా రిలీజ్‌పై అనుమానాలు పెరిగిపోయాయి.
ఏప్రిల్ లోగా సినిమా పూర్తవదని శంకర్ చెప్పలేదుగానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆశించిన వేగం కన్పించడంలేదన్న ఆయన వ్యాఖ్యలతో సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. ఈ ఆలస్యం సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దడానికేనని శంకర్ అంటున్నాడు. 2017 చివర్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆ తర్వాత అది 2018 జనవరి 26న రావొచ్చన్నారు. ఇప్పుడేమో ఏప్రిల్‌లో విడుదల అనే ప్రచారం జరుగుతోంది. ఇంకొంచెం ఆలస్యమంటే కంప్లీట్‌గా వేసవికి సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు.
'2.0' సినిమా కోసం రజనీకాంత్ తదుపరి సినిమా 'కాలా' భవిష్యత్ ఆధారపడి ఉంది. రాజకీయాల్లోకి కూడా వచ్చేసిన రజనీకాంత్, '2.0' విడుదలైతే ఆ సినిమా ప్రమోషన్స్ పూర్తవుతాయి కాబట్టి, రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. కానీ '2.0' సినిమాకి సంబంధించి ఏదీ అనుకున్నట్టు జరగడంలేదు.