ఇండియన్ సినిమా ఇండియాలో కంటే, చైనాలో ఎక్కువ పాపులర్ అవుతోంది. గతంలో చైనా సినిమాలకి ఇండియాలో ఎక్కువ గిరాకీ ఉండేది. చైనాలో సంప్రదాయ యుద్ధ విద్యలకు చాలా ప్రాధాన్యత ఉండేది. చైనా, జపాన్, కొరియాల నుంచి స్టార్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సందర్భాలున్నాయి.
అయితే 'దంగల్' సినిమాతో సీన్ మారింది. ఇండియా కంటే ఎక్కువ వసూళ్ళు చైనా నుంచి రాబడుతోంది ఇండియన్ సినిమా. 1400 కోట్ల రూపాయల్ని చైనాలో 'దంగల్' సినిమా వసూలు చేసింది. అంతకు ముందు 'పీకే' కూడా చైనాలో మంచి విజయాన్ని అందుకుంది. లేటెస్ట్ హిట్ 'సీక్రెట్ సూపర్ స్టార్' చైనాలో వసూళ్ళ కనక వర్షం కురిపించేస్తోంది. చైనాలో వసూళ్ళను చూసి 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్ర దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. ప్రధానంగా అమీర్‌ఖాన్ నటించిన సినిమాలకు చైనాలో ఫాలోయింగ్ బాగా ఉంటోంది.
అయితే దేశంలో సంచలనాలు సృష్టించిన 'బాహుబలి-1' సినిమా మాత్రం చైనాలో విఫలమయ్యింది. చైనా ఆడియన్స్ పల్స్‌ని దృష్టిలో పెట్టుకుని, సినిమా మేకింగ్‌లో చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇండియన్ సినిమా మార్కెట్ ఇంకా పెరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే అన్ని సినిమాలూ చైనాలో ఆడేయడం లేదు కాబట్టి, చైనా మార్కెట్‌ని అంతగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇంకొందరు సినిమా ప్రముఖులు సూచిస్తుండడం జరుగుతోంది.
చైనాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి కూడా మంచి ఇమేజ్ ఉంది. చైనా మాత్రమే కాదు జపాన్ సహా పలు దేశాల్లో రజనీకాంత్ స్టార్‌డమ్ కొనసాగిస్తున్నారు.